గ్రీన్‌కార్డుల(Green Card) జారీలో సమానత్వాన్ని తీసుకురావాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. అన్ని దేశాలకు ఒకే విధంగా (7శాతం పరిమితి) ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డుల జారీ నియమాన్ని తొలగించాలని బిల్లులో పేర్కొన్నారు. ఈ బిల్లు గట్టెక్కితే గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అనేకమంది భారతీయ ఐటీ ఉద్యోగులకు లబ్ధి చేకూరే అవకాశముంది.
'2021 ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్‌కార్డ్స్(Green Card) ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్(ఈఏజీఎల్ఈ)' బిల్లును కాంగ్రెస్ సభ్యులు జో లఫ్గ్రెన్, జాన్ కర్టిస్ ప్రవేశపెట్టారు. అదే సమయంలో కుటుంబ ఆధారిత వీసాలపై ఉన్న పరిమితిని 15శాతానికి పెంచాలని బిల్లులో పేర్కొన్నారు. అగ్రరాజ్య వలసల వ్యవస్థ ఎన్నో దశాబ్దాలుగా దెబ్బతిందని, మార్చే సమయం వచ్చిందని వెల్లడించారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న దేశాలపై 7శాతం పరిమితిని 1990లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అధిక జనాభా ఉన్న దేశాలకు, తక్కువ జనాభా ఉన్న దేశాలకు ఒకే విధంగా పరిగణించి, గ్రీన్‌కార్డులను జారీ చేస్తున్నారు. ఫలితంగా.. అధిక జనాభాలోని మెరుగైన నైపుణ్యం ఉన్నవారికి అవకాశం దక్కడం లేదని లఫ్గ్రెన్ అభిప్రాయపడ్డారు. వారిని ఇతర దేశాలు ఆకర్షిస్తున్నాయని, చివరికి ఇది అగ్రరాజ్య ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు.
ఇదీ చూడండి:- ట్రంప్ 'గ్రీన్‌కార్డు' నిబంధనకు బైడెన్ చెక్