అమెరికాలోని పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా.. వచ్చే ఏడాదికిగాను ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ 6 ట్రిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ను ప్రకటించారు. కానీ, ఇప్పటికే.. అప్పుల్లో కూరుకుపోయిన అగ్రరాజ్యాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆయన పన్నులు చెల్లించే కార్పొరేట్ సంస్థలు, సంపన్నులపై ఆధారపడినట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణ కోసం ఈ ఏడాది ప్రారంభంలో అధిక ఖర్చులు వెచ్చించి విజయం సాధించిన బైడెన్.. శనివారం ప్రకటించిన బడ్జెట్లో ఇటీవల మౌలిక వసతుల కల్పన కోసం కేటాయించిన ప్యాకేజీని జత చేస్తున్నట్లు చెప్పారు.
అప్పుల భారం..
ఈ ఏడాది అమెరికా లోటు రికార్డు స్థాయిలో 3.7 ట్రిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. అయితే తాజా బడ్జెట్ ప్రణాళికతో అది వచ్చే ఏడాదికి 1.8 ట్రిలియన్ డాలర్లకు పడిపోతుందని.. అయినా కరోనా ముందు రోజులకంటే రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే 5 ట్రిలియన్ డాలర్ల నిధులను కొవిడ్ సంక్షోభం ఉపశమనం కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. త్వరలోనే అమెరికా అప్పులు 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. ఫలితంగా ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి డాలరుకు 50 సెంట్లను అప్పు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
కష్టపడి పనిచేసే వారి కోసమే..
ఆర్థిక వృద్ధి సాధించటానికి.. పై నుంచి కిందకు వెళ్లడం ఉత్తమమైనమార్గం కాదన్న బైడెన్.. కింద నుంచి పైకి వెళ్లటమే సరైన మార్గమని తన బడ్జెట్ సందేశంలో తెలిపారు. ఎవరైతే.. ప్రతిరోజు కష్టపడి పని చేసి, తమ కుటుంబాలను పోషిస్తారో, ఎవరైతే పన్నులను సకాలంలో చెల్లిస్తూ.. దేశానికి సేవ చేస్తారో వారి శ్రేయస్సు కోసం ఈ బడ్జెట్ను రూపొందించామని ఆయన పేర్కొన్నారు.
రాబోయే ఎనిమిదేళ్లలో మౌలిక రంగ అభివృద్ధికి 2.3 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని బైడెన్ ఇటీవల ప్రకటించారు. అమెరికాలోని కుటుంబాల కోసం 1.8 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ, అమెరికా రక్షణ వ్యవస్థ కోసం 1.5 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించారు. వీటిని తాజా బడ్జెట్లో జత చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: అమెరికా రక్షణ మంత్రితో జై శంకర్ భేటీ