అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటం వల్ల అమెరికా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందని ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌కు చేరువగా వచ్చిన డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.. గెలవడం ఖాయమని ఆయన ప్రచార వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్లు బైడెన్‌కు భద్రతను పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రంగంలోకి సీక్రెట్ సర్వీసు..
బైడెన్ భద్రతను పెంచేందుకు అమెరికా సీక్రెట్ సర్వీసు సంస్థ.. అధికారులను పంపించినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక పేర్కొంది. విల్మింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బైడెన్ శుక్రవారం కీలక ప్రసంగం చేసే అవకాశం ఉందని.. ఫలితంగా ఆయనకు భద్రత కల్పించేందుకు సీక్రెట్ సర్వీస్ ఏర్పాట్లు చేస్తోందని అందులో వివరించింది. ఈ ప్రణాళికల్లో భాగమైన ఇద్దరు అధికారులు ఈ విషయాన్ని తమకు చెప్పినట్లు వెల్లడించింది.
తన ప్రసంగానికి విల్మింగ్టన్ సెంటర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉందని బైడెన్ ప్రచార వర్గం.. సీక్రెట్ సర్వీస్‌కు సమాచారం ఇచ్చిందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా స్వల్పంగానే ఉంది. అమెరికా మీడియా ప్రకారం.. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో బైడెన్ ముందంజలో ఉన్నారు. 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన బైడెన్‌కు.. అధ్యక్ష పీఠానికి చేరుకునేందుకు మరో 6 ఓట్లు కావాల్సి ఉంది. లెక్కింపు కొనసాగుతున్న నెవడా, జార్జియాలో ఆయన ఆధిక్యంలో ఉన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. మరో మూడు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు.