గతేడాది నవంబర్‌లో ఉత్కంఠభరితంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై గెలిచి శ్వేతసౌధ అధిపతి పీఠాన్ని దక్కించుకున్నారు జో బైడెన్. 50ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో అధ్యక్ష బరిలో నిలిచి గెలుపొందారు. శ్వేతసౌధ అధిపతి కావాలనే చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. దీని కోసం తీవ్రంగా శ్రమించారు.
అయితే అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేని పరిస్థితుల మధ్య ఈసారి ఎన్నికలు జరిగాయి. కరోనా సృష్టించిన కల్లోలం కారణంగా అగ్రరాజ్యం ఛిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దేశంలో అశాంతి నెలకొంది. ఇలాంటి సమయంలో ట్రంప్‌ను ఢీకొట్టారు 77 ఏళ్ల బైడెన్. చివరికి.. సుదీర్ఘ కాలం సెనేటర్‌గా, ఉపాధ్యక్షుడిగా తనుకున్న అనుభవంతో విజయం కైవసం చేసుకున్నారు.
అప్పట్లోనే..
బైడెన్‌కు 1988లోనే తొలిసారి అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం దక్కింది. కానీ అప్పట్లో ప్రసంగం కోసం గ్రంథచౌర్యం చేశారన్న ఆరోపణలతో నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 2008లోనూ కొద్దిలో మరో అవకాశం చేజారింది.
చరిత్ర..
ట్రంప్‌పై బైడెన్ విజయం సాధించి.. అమెరికా చరిత్రలో అతిపెద్ద వయసులో అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు.
ఒబామాతో సాన్నిహిత్యం..
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో రెండు సార్లు ఉపాధ్యక్షునిగా ఉన్న బైడెన్‌కు ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఒబామా ఏ కీలక విషయంపై నిర్ణయం తీసుకోవాలన్నా బైడెన్‌ను సంప్రదించేవారని అమెరికన్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లెన్నీ స్టెయిన్బర్నే తెలిపారు.
29ఏళ్లకే సెనేటర్‌గా..
1972లో 29ఏళ్ల వయస్సులోనే సెనేట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు బైడెన్. ఈ విజయం తర్వాత నెలరోజులకే ఆయన భార్య, కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆయన్ను విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనలో బైడెన్ ఇద్దరు కుమారులు బ్యూ, హంటర్ గాయపడ్డారు. వారు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న గది నుంచే సెనేటర్‌గా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు బైడెన్.
వైద్యుల హెచ్చరిక
1988లో అధ్యక్ష అభ్యర్థిగా నిలిచే అవకాశం చేజారిన కొద్ది రోజులకే బైడెన్ రెండు సార్లు మెదడు రక్తనాళాల వాపు సమస్యతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు అప్పట్లో హెచ్చరించారు.
కుమారుడి మృతితో..
బైడెన్ పెద్ద కుమారుడు బ్యూ బైడెన్ 2015, మేలో బ్రెయిన్ క్యాన్సర్‌తో మృతి చెందారు. అనంతరం బైడెన్ కుంగిపోయారు. ఆయన రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే అని అందరూ భావించారు. ఐదేళ్ల తర్వాత విషాదాన్ని అధిగమించి అధ్యక్ష బరిలో నిలిచారు బైడెన్. అమెరికా ప్రజలే తనను ముందుకు నడిచేలా దారి చూపారని డెమొక్రాట్ల జాతీయ సదస్సు ప్రసంగంలో తెలిపారు. జీవితంలో పరిస్థితి కొన్నిసార్లు అగమ్య గోచరంగా ఉంటుందన్నారు.
"జీవితంలో నేను రెండు విషయాలు నేర్చుకున్నాను. మొదటిది.. మీరు ప్రేమించేవారు ఈ లోకాన్ని వీడినా.. మీ హృదయాల్లో వారు ఎప్పటికీ ఉంటారు. రెండోది.. బాధ, నష్టం, దుఃఖం ద్వారా మనం ముందుకు సాగడానికి ఒక కారణం ఉంటుందని తెలుసుకున్నా."
- జో బైడెన్.
ఆరుసార్లు...
సెనేట్‌కు ఆరు సార్లు ఎన్నికైన బైడెన్.. ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. విదేశీ సంబంధాల వ్యవహారాల్లో తనదైన ముద్రవేశారు. అయితే 1994లో నేర బిల్లులో జోక్యం చేసుకున్నారని, లైంగిక వేధింపుల కేసులో అందరూ పురుషులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి.
ముక్కుసూటి నైజం
మనసులో అనుకున్నది ముక్కుసూటిగా చెప్పే బైడెన్ నైజమే అయనకు రాజకీయాల్లో ఖ్యాతిని తెచ్చిపెట్టింది. పలు సార్లు మీడియా సమావేశాల్లో ఆయనకు ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. బైడెన్ మాట తీరు ఈ అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా సరిపోయిందని, ట్రంప్‌ను ఢీకొట్టేందుకు సరైన వ్యక్తి అని డెమొక్రాట్లు అభిప్రాయపడ్డారు. ఈ అవకాశం తన రాజకీయ జీవితంలాగే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న తర్వాత బైడెన్‌కు దక్కింది.
ఆరోపణలు..
అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ముందు బైడెన్‌పై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయన అనేక మంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని విమర్శలొచ్చాయి. వాటిని ఖండిస్తూ ఆయన ముందుకుసాగిపోయారు.
చారిత్రక నిర్ణయం..
దక్షిణ కరోలినా ప్రాథమిక ఎన్నికల్లో ఘన విజయంతో ఆయన తిరుగులేకుండా అధ్యక్ష ఎన్నికల ప్రయాణాన్ని ముందుకు సాగించారు. కాలిఫోర్నియా సెనేటర్ కమాలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆగస్టులో ప్రకటించారు. ఒక నల్లజాతీయురాలికి ఆ అవకాశం ఇవ్వడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.
బైడెన్ ఎంపిక డెమొక్రాట్లలో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఎన్నికల్లో విజయం కోసం ముందుకు సాగేందుకు దోహద పడింది.