అగ్రరాజ్య తదుపరి అధ్యక్షునిగా జోబైడెన్ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో.. అమెరికా అధ్యక్షుల్లో అత్యంత పెద్దవయస్కుడిగా జో బైడెన్ రికార్డు సృష్టించబోతున్నారు. గత నవంబరులో బైడెన్‌కు 78 సంవత్సరాలు నిండాయి. బైడెన్ కంటే ముందు ప్రమాణ స్వీకారం సమయానికి అత్యంత ఎక్కువ వయస్సున అధ్యక్షుడు ట్రంపే! నాలుగేళ్ళ కిందట 45వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసేనాటికి ట్రంప్ వయసు 70 సంవత్సరాలు. ఆయనకంటే ముందు 69 సంవత్సరాల వయసులో రొనాల్డ్ రీగన్ ప్రమాణం చేశారు. మరి అత్యంత పిన్నవయసులో అధ్యక్షుడైన వారెవరు? చాలామంది 43 సంవత్సరాల జాన్ ఎఫ్ కెనడీ పేరు చెబుతారు. కానీ రూజ్‌వెల్ట్ 42 ఏళ్ళ వయసులోనే (1901) అధ్యక్షుడయ్యారు. యులిసెస్ గ్రాంట్ (46), బిల్ క్లింటన్ (46), ఒబామా (47) ఏళ్ళ వయసులో అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదీ చూడండి: 'జో బైడెన్‌కు ఇదో సువర్ణావకాశం'
అగ్నిప్రమాదం.. లాక్‌డౌన్..
భద్రతపరమైన ముప్పు ఉందన్న సమాచారంతో అమెరికాలో 'క్యాపిటల్ హిల్' భవనం సోమవారం కొద్దిసేపు మూతపడింది. ఈ సముదాయంలో రాకపోకలు సాగించడానికి ఎవరినీ అనుమతించలేదు. దీనికి కాస్త దూరంలో స్వల్పస్థాయి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ వెంటనే అప్రమత్తత ప్రకటించారు. కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలని పోలీసులు సందేశం ఇవ్వడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ఆ వెంటనే తాత్కాలిక లాక్‌డౌన్ విధించి, కొంతసేపటి తర్వాత తొలగించారు.
అధ్యక్షునిగా జో బైడెన్ చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని సన్నాహక కసరత్తు చేస్తున్నవారిని ముందుజాగ్రత్త చర్యగా అక్కడి నుంచి తరలించారు. వాషింగ్టన్ డీసీ అంతటా భద్రతను అనూహ్యరీతిలో పెంచారు.
ఇదీ చదవండి : ప్రమాణస్వీకారానికి ఇంత ఆలస్యం ఎందుకు?