అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్, కమలా హారిస్‌లకు ట్రంప్ పరిపాలనా విభాగం నుంచి భద్రత, నిఘా సమాచారం అందడం లేదని బైడెన్ అధికార మార్పిడి బృందం తెలిపింది. అయితే ఇది ఆశ్చర్యం కలిగించే విషయం కాదని, అందురూ ఊహించినదేనని పేర్కొంది.
" నిఘా వర్గాల సమాచారం, వాస్తవపరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా బలగాలు, శత్రు దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పు వంటి అంశాలపై ట్రంప్ పరిపాలనా విభాగం బైడెన్, హారిస్‌లతో సమాచారం పంచుకోవడం లేదు. అందుకు సంబంధించిన వివరాలేవి చెప్పడం లేదు."
జెన్ సాకీ, బైడెన్ అధికార మార్పిడి బృందం సలహాదారు.
ఈ విషయంపై ట్రంప్ యంత్రాంగంతో వాగ్వాదానికి దిగే ఆలోచన తమకు లేదని జెన్ సాకీ చెప్పారు. కీలకమైన భద్రత సమాచారం తమతో పంచుకుంటే కొవిడ్ కట్టడికి ప్రాణాళికలు రూపొందించాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 6 రోజులు గడుస్తున్నా తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఆమె అన్నారు.
నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించారు. అయితే ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులను ఆశ్రయించి భంగపాటుకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: 'కరోనా కట్టడికి ట్రంప్ అత్యవసర చర్యలు చేపట్టాలి'