కరోనా సంక్షోభం, క్యాపిటల్ హింసాకాండ వల్ల నెలకొన్న అనిశ్చితి మధ్య మరికొద్ది గంటల్లో డెమొక్రాట్ నేత జో బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అగ్రరాజ్య చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భద్రతా చర్యలు చేపట్టారు.
ప్రమాణస్వీకారం..
- మధ్యాహ్నం 12గంటలకు(భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30) అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా క్యాపిటల్ ఎదుట బైడెన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ బైడెన్ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.
- తన కుటుంబానికి చెందిన 127ఏళ్ల బైబిల్‌పై ప్రమాణస్వీకారం చేయనున్నారు బైడెన్. ఆ సమయంలో బైబిల్‌ను జో బైడెన్ భార్య జిల్ బైడెన్ పట్టుకుని ఉంటారు.
- ఆ తర్వాత.. ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణం చేస్తారు. జస్టిస్ సోనియా సొటొమేయర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
- ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడిగా తొలి ప్రసంగం చేయనున్నారు బైడెన్. "అమెరికా యునైటెడ్" థీమ్ మీద ఈ ప్రసంగం ఉండనుంది.
భద్రతా వలయం...
క్యాపిటల్ హింసాకాండతో అప్రమత్తమైన అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 25వేలకుపైగా మంది నేషనల్ గార్డ్స్.. విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:- గందరగోళం, అపఖ్యాతి మధ్య ట్రంప్ 'వీడ్కోలు'
వేడుకలో ఎవరెవరు..
ఈసారి వేడుకలో పాల్గొనే వారికన్నా భద్రతా సిబ్బందే ఎక్కువ సంఖ్యలో ఉండనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రజలు, మద్దతుదారులు ఇళ్లకే పరిమితమవ్వాలని అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు ఇప్పటికే పిలుపునిచ్చారు. దీనితో పాటు తాను అధ్యక్ష ప్రమాణస్వీకారానికి దూరంగా ఉంటానని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు క్యాపిటల్ ఘటన నేపథ్యంలో భద్రతా సమస్యల వల్ల పలువురు చట్టసభ్యులు వేడుకకు రాబోమని పేర్కొన్నారు.
ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, కాంగ్రెస్ సభ్యులు వేడుకకు హాజరయ్యే అవకాశముంది. వేడుకకు వచ్చే వారు తమతో పాటు ఓ అతిథిని కూడా తీసుకెళ్లవచ్చు.
మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా తదితరులు ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరవుతారు.
ప్రమాణస్వీకారం తర్వాత...
ప్రమాణస్వీకారం అనంతరం అనాదిగా సాగుతున్న "ద పాస్ ఇన్ రివ్యూ" వేడుకలో పాల్గొంటారు బైడెన్. క్యాపిటల్లోనే ఇది కూడా జరుగుతుంది. దేశ భద్రతా దళాలను పర్యవేక్షిస్తారు. అయితే భౌతిక దూరాన్ని పాటించే విధంగా ఈసారి సంఖ్యను కుదించారు.
రాత్రి వేడుకలు..
- నటుడు టామ్ హ్యాంక్స్ నేతృత్వంలో రాత్రి 8.30 గంటలకు(అమెరికా కాలమానం) ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది.
- ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా అమెరికా జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. జెన్సిఫర్ లోపెజ్, గార్త్ ట్రూక్ల ప్రదర్శన ఉంటాయి.
తొలి సంతకం...
ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలకు 15 అంశాలపై కార్యనిర్వాహణ ఆదేశాలు జారీ చేయనున్నారు. వీటిలో పారిస్ వాతావరణ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరడం, 100రోజుల పాటు మాస్కులు తప్పనిసరి, ముస్లింలపై దేశంలో నిషేధం వంటివి ఉన్నాయి. అధ్యక్ష కార్యాలయంలో బైడెన్ తొలిరోజు ఇలా సాగనుంది.
అయితే వీటిల్లో ఇమ్మిగ్రేషన్ బిల్లు కూడా ఉంది. ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే నూతన ఇమ్మిగ్రేషన్ బిల్లు(యూఎస్ సిటిజెన్షిప్ యాక్ట్ ఆఫ్ 2021)ను కాంగ్రెస్‌కు పంపనున్నారు బైడెన్. బిల్లులో బైడెన్ తీసుకొచ్చే సంస్కరణలతో వేలాది మంది భారత ఐటీ నిపుణులకు లబ్ధి చేకూరనుంది.
ఇదీ చూడండి:- ఇక నుంచి ట్రంప్ నివాసం ఇదే...