ఎన్నికల హామీలో పేర్కొన్న విధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతివివక్ష నిర్మూలనకు చర్యలు చేపట్టారు. వ్యవస్థాగత వివక్షను నిర్మూలించి, దేశవ్యాప్తంగా సమానత్వం ఉండేలా నాలుగు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆసియా అమెరికన్లు, పసిఫిక్ దీవులకు చెందిన వారిపైన జాత్యహంకారులు వివక్ష చూపకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వారితో మరింత సన్నిహితంగా మెలగాలని న్యాయశాఖకు సూచించారు. కొవిడ్‌పై పోరులో వివక్షకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్య, మానవహక్కుల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన 'కౌంటర్ ఫాక్చువల్ 1776 కమిషన్'ను బైడెన్ రద్దు చేశారు.
"జార్జి ఫ్లాయిడ్ మరణంతో న్యాయ వ్యవస్థ గొంతు నులిమినట్టు అయింది. నేను అతని కుమార్తెను కలిసినప్పుడు.. మా నాన్న ప్రపంచాన్ని మార్చాడు అని ఆ చిన్నారి చెప్పింది. ఆమె చెప్పింది నిజం. ఆ ఘటన మార్పునకు కారణమైంది. అందరూ సమానం అని పేర్కొనే మన దేశ మూల సూత్రాలను ఏనాడూ అనుసరించలేదు. అవి పాటించాల్సిన సమయం వచ్చింది."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ప్రైవేటు జైళ్లు రద్దు..
జైళ్ల నిర్వహణపై ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన అనుమతుల్ని బైడెన్ రద్దు చేశారు. ఈ చర్యతో జైళ్లపై కార్పొరేట్ సంస్థల అక్రమార్జనకు అడ్డుకట్ట పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం 14వేల మంది నేరస్థులు ప్రైవేటు సంస్థల నిర్వహణలో ఉన్న జైళ్లలోనే శిక్ష అనుభవిస్తున్నారు. ఇది మొత్తం నేరస్థుల సంఖ్యలో 9 శాతం.
బైడెన్‌కు ఎదురుదెబ్బ..
హామీల్లో ఒకటైన వలసలకు సంబంధించి బైడెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ వలసదారుల బహిష్కరణపై జారీ చేసిన 100 రోజుల మారటోరియాన్ని స్థానిక కోర్టు నిలిపివేసింది. ఈ మేరకు హోంశాఖకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్రమ వలసదారులకు కూడా చట్టబద్ధత కల్పించాలన్న బైడెన్ ప్రయత్నానికి బ్రేక్ పడినట్టు అయింది.
ఇదీ చదవండి : ట్రంప్ అభిశంసనపై విచారణ- నిర్దోషిగా తేలే అవకాశం!