అమెరికా ఆస్తులు, నిధులు వినియోగించకుండా మయన్మార్ సైనిక ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తూ కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. మయన్మార్ సంక్షోభం అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధంగా ఉందని తెలిపారు. మయన్మార్‌పై బైడెన్ ఆంక్షలు విధించడం వరుసగా ఇది రెండోసారి.
"మయన్మార్‌లో 2021 ఫిబ్రవరి 1న సైనికులు... తిరుగుబాటు చర్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఆటంకం కలిగించారు. ప్రభుత్వ అధికారులను, నేతలను, జర్నలిస్టులను అరెస్టు చేశారు. ప్రజల ఆకాంక్షకు విఘాతం కలిగించారు. ఇది అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధానాలకు విరుద్ధం," అని బైడెన్ పేర్కొన్నారు.
మయన్మార్ ఆర్థికవ్యవస్థలో భాగమైన అమెరికా ఆస్తులను వినియోగించడం, బదిలీ చేయడం వంటి కార్యకలాపాలకు అనుమతి లేదని బైడెన్ ఆదేశించారు. శాంతి భద్రతకు ముప్పు కలిగించే చర్యలు, స్వేచ్ఛను హరించే చర్యలు, ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రక్రియకు అమెరికా నిధులు సమకూర్చదని స్పష్టం చేశారు. సైనిక, భద్రతా దళాలు అమెరికా నిధులు వినియోగించుకోకుండా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
బుధవారం.. మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుకు కారణమైన అధికారులపై ఆంక్షలు విధించారు. తమ దేశంలోని 1 బిలియన్ డాలర్లు విలువ చేసే అస్తులను మయన్మార్ సైనికాధికారులు వినియోగించకుండా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు.
మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని కూల్చి.. మిలిటరీ తిరుగుబాటు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం అవకతవకలు చేసిందన్న కారణంతో ఈ చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. ఫలితంగా ఆ దేశాధినేత్రి ఆన్ సాంగ్ సూకీని గృహ నిర్బంధం చేసింది. ఈ వ్యవహారంపై ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. ఈ క్రమంలోనే బైడెన్ మయన్మార్‌పై ఆంక్షలు విధించారు.
ఇదీ చదవండి: