పేద దేశాల్లో టీకా పంపిణీకి చేయూతగా.. అమెరికా నాలుగు బిలియన్ డాలర్ల(రూ.29వేల కోట్ల)ను విరాళంగా అందించనుంది. జీ-7 దేశాల(యూకే, ఫ్రాన్స్, జపాన్, కెనడా, ఇటలీ, జర్మనీ)తో శుక్రవారం జరగనున్న చర్చల సందర్భంగా అధ్యక్షుడు బైడెన్ నిధుల మంజూరుపై ప్రకటన చేయనున్నారు. ఈ నిధులను.. 2022 చివరి నాటికి విడతల వారీగా పంపిణీ చేయనున్నట్టు శ్వేతసౌధం అధికారులు స్పష్టం చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో చురుకుగా పాలుపంచుకోవాలని సభ్య దేశాలను అధ్యక్షుడు ప్రోత్సహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సరిపడా టీకాలు అందేలా కృషి చేయడానికి అమెరికా కట్టుబడి ఉంది.
-శ్వేతసౌధం.
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొవాక్స్ను వ్యతిరేకించారు. డబ్ల్యూహెచ్ఓకు ఇచ్చే నిధులను నిషేధించారు. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే ట్రంప్ చర్యలను తిరిగిరాశారు బైడెన్. డబ్ల్యూహెచ్ఓకు నిధులు అందివ్వడం సహా కొవాక్స్లో అమెరికా పాలుపంచుకుంటుందని ప్రకటించారు.
అయితే అమెరికాలో ఉత్పత్తి చేసిన టీకాలను ఇతర దేశాలకు పంపిణీ చేయాలని ఆ దేశంపైన ఒత్తడి వస్తున్న నేపథ్యంలో.. కొవాక్స్ కార్యక్రమంపై బైడెన్ పిలుపునకు సభ్య దేశాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా సహా ఐరోపా దేశాలు తమ టీకా పంపిణీల్లో 5 శాతం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ గురువారం ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు.
టీకాల పంపిణీ విషయంలో ప్రపంచ దేశాల వైఖరిపై ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు ఆంటోనియో గుటేరస్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. 130 దేశాలకు ఇప్పటివరకు ఒక్క డోసు టీకా కూడా అందలేదని తెలిపారు.
ఇదీ చదవండి : 'అమెరికాకు భారత్ కీలక రక్షణ భాగస్వామి'