తుపాకుల వినియోగంపై ఇటీవల ప్రతిపాదించిన బిల్లులకు చట్టసభల్లో ఆమోదం లభించని నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. సీరియల్ నంబర్లు లేనివి, నాటు తుపాకీల వినియోగాన్ని కట్టడి చేసేందుకు వాటిపై ఆంక్షలు విధిస్తున్నట్టు గురువారం స్పష్టం చేశారు. వీటిని తుపాకీ నియంత్రణ చట్టం పరిధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. తుపాకుల వినియోగం ఓ అంటువ్యాధి వంటిదని బైడెన్ పేర్కొన్నారు.
అయితే బైడెన్.. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న విధంగా తుపాకుల దిగుమతిపై నిషేధం, ఉపసంహరణ, కట్టడి చేసేందుకు దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక అధికారాలు మొదలైన హామీలకు కార్యరూపం ఇవ్వలేకపోయారు. ఈ విషయంపై చట్టసభల్లో రిపబ్లికన్ల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతే కారణం.
తుపాకీ వినియోగంపై గత నెల బిల్లులను ప్రవేశపెట్టగా బైడెన్ ప్రభుత్వానికి ఎగువ సభ సెనేట్లో చుక్కెదురైంది. బిల్లు ఆమోదం పొందడానికి సరైన మెజారిటీ లభించలేదు. బిల్లు చట్టంగా మారేందుకు 60 ఓట్లు అవసరం కాగా.. 10 మంది రిపబ్లికన్ల మద్దతును కూడగట్టే పనిలో డెమొక్రాట్లు నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి : అమెరికాలో కాల్పుల కలకలం- ఒకరు మృతి