అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పట్టున్న మూడు కీలక రాష్ట్రాల్లో జో బైడెన్ ముందంజలో ఉన్నట్లు హిల్/హారిస్ పోలింగ్ సర్వేలో తేలింది. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన నార్త్ కరోలినా, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా రాష్టాల్లో ఈ సారి ఓటర్లు బైడెన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా వారం రోజులు కూడా గడువు లేని తరుణంలో ఈ పరిణామం ట్రంప్ వర్గాన్ని కలవరపాటుకు గురిచేసే అవకాశముంది.
- సర్వే ప్రకారం ఫ్లోరిడా రాష్ట్రంలో ట్రంప్‌పై బైడెన్ 3 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్‌కు 47 శాతం మంది ఓటర్లు మరోసారి అవకాశమిచ్చేందుకు మొగ్గుచూపగా.. బైడెన్‌కు అనుకూలంగా 50 శాతం మంది ఉన్నారు. ఇదే రాష్ట్రంలో క్విన్నిపియాక్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో బైడెన్‌కు 45 శాతం, ట్రంప్‌కు 42శాతం మంది ఓటర్లు మద్దతు తెలిపారు. రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వేలో మాత్రం ట్రంప్‌పై బైడెన్ 7.7శాతం ఆధిక్యం సాధించారు.
- పెన్సిల్వేనియా రాష్ట్రంలో హిల్/హారిస్ నిర్వహించిన సర్వేలో బైడెన్ వైపు 51 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు. ట్రంప్‌కు 46శాతం మంది మద్దతు తెలిపారు. క్విన్నిపియాక్ సర్వేలో బైడెన్‌కు 51శాతం, ట్రంప్‌కు 44శాతం ఓటర్లు అనుకూలంగా ఉన్నారు. రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వేలో ట్రంప్‌పై బైడెన్ 4.3 పాయింట్ల అధిక్యంలో ఉన్నారు.
- నార్త్ కరోలినా రాష్ట్రంలో మాత్రం ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇద్దరి మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల వ్యత్యాసమే ఉంది. బైడెన్‌కు 49శాతం మంది ఓటర్లు మద్దతు తెలిపారు. ట్రంప్‌కు అనుకూలంగా 48శాతం మంది ఉన్నారు.
అయితే ఈ రాష్ట్రంలోని శ్వేతజాతీయుల్లో 60శాతం మంది ట్రంప్ వైపే ఉండగా.. 38శాతం మంది మాత్రమే బెైడెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆఫ్రో అమెరికన్లు మాత్రం బైడెన్‌కే పట్టం కడుతున్నారు. వారిలో 91శాతం మంది బైడెన్‌కు అనుకూలంగా ఉన్నారు. 6 శాతమే ట్రంప్‌కు మద్దతు తెలిపారు. లాటినో అమెరికన్ ఓటర్లు ట్రంప్ కంటే బైడెన్ పైనే ఎక్కువ నమ్మకంగా ఉన్నారు. వారిలో 52 శాతం మంది బైడెన్‌ను, 42 శాతం మంది ట్రంప్‌ను ఎన్నుకున్నారు.
ఆన్లైన్లో నిర్వహించిన ఈ పోలింగ్ సర్వేలో ఫ్లోరిడా నుంచి 1,148మంది, నార్త్ కరోలినా నుంచి 903, పెన్సిల్వేనియా నుంచి 901మంది ఓటర్లు పాల్గొన్నారు.
నవంబరు 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.