అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికవటం కష్టమేనని సర్వే సంస్థల తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు మరో 3 రోజులే ఉండగా.. ఫాక్స్ న్యూస్ విడుదల చేసిన పోల్ ఫలితాల్లో తన ప్రధాన ప్రత్యర్థి జోబైడెన్‌తో పోలిస్తే ట్రంప్‌కు తక్కువ మంది మద్దతిస్తున్నట్లు వెల్లడైంది.
ఫాక్స్ న్యూస్ చేసిన సర్వేలో 52 శాతం మంది బైడెన్‌కు మద్దతు తెలపగా.. ట్రంప్‌కు 44 శాతం అనుకూలంగా ఉన్నట్లు తేలింది. ఇందులో 2 శాతం మంది థర్డ్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపగా.. మరో 2 శాతం ఎటూ తేల్చుకోలేకపోయినట్లు ఫాక్స్ న్యూస్ తెలిపింది.
కీలక రాష్ట్రాలతో సహా అమెరికా వ్యాప్తంగా బైడెన్‌కే ప్రజల మద్దతు అధికంగా ఉందని ఫాక్స్ న్యూస్ వివరించింది. ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ 8 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడించింది.
వివిధ సర్వేలు ఇలా..
- మరో ప్రముఖ సంస్థ సీఎన్ఎన్ చేసిన సర్వేలోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. బైడెన్‌కు 54 శాతం మంది అనుకూలంగా ఉన్నారని స్పష్టం చేసింది. అదే సమయంలో ట్రంప్‌కు 42 శాతం మంది మద్దతు తెలిపారు.
- రియల్ క్లియర్ పాలిటిక్స్ నిర్వహించిన సర్వేలో పోలింగ్ సగటులో బైడెన్‌కు 51.4 శాతం, ట్రంప్‌కు 43.5 శాతం మద్దతు ఉన్నట్లు తేలింది.
- క్విన్నిపియాక్ విశ్వవిద్యాలయం పోల్‌లో బైడెన్‌కు 10 పాయింట్ల ఆధిక్యం లభించింది.
- రాయిటర్స్ అక్టోబర్ 21న విడుదల చేసిన సర్వే ఫలితాల్లో.. బైడెన్ 49 శాతం ఓటర్ల మద్దతుతో ఆధిక్యంలో ఉండగా.. ట్రంప్ 45 శాతంతో వెనకంజలో ఉన్నారు.
ఇదీ చూడండి: బైడెన్‌కు భారీగా పడనున్న ఆసియా- అమెరికన్ల ఓట్లు!