అగ్రరాజ్యం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా విజయం సాధించిన జో బైడెన్ కొవిడ్ నేపథ్యంలో కొద్ది మంది అధికారుల సమక్షంలోనే అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాధారణంగా లక్షల మంది అమెరికన్ల ముందు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే సంప్రదాయం ఉన్నా... కొవిడ్ విజృంభణతో ఈ కార్యక్రమాన్ని అమెరికా అంతటా వర్చువల్‌గా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శ్వేతసౌధం అధికారులు ప్రకటన విడుదల చేశారు.
జనవరి 20న వాషింగ్టన్‌లో జరగబోయే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఆమె భర్త పాల్గొంటారు. ఈ రోజునే అమెరికా సైనిక దళాల వందనాన్ని కూడా బైడెన్ స్వీకరిస్తారు. వీరంతా భౌతిక దూరం నిబంధనలు పాటిస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ ప్రజలు వర్చువల్‌గా భాగస్వాములు అయ్యేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'నాకు ఆ ఓట్లు కావాలి'- జార్జియా అధికారితో ట్రంప్