అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లతో పోలిస్తే ఇతర దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అల్‌ఖైదా వంటి ఉగ్రమూకల నుంచే అమెరికాకు అధిక ముప్పు ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. కాబట్టి అఫ్గాన్‌లో అమెరికా తన సైన్యాన్ని మోహరించడానికి హేతుబద్ధమైన కారణాలు లేవని అన్నారు. ఈ మేరకు ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
సిరియా సహా తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపులు అఫ్గానిస్థాన్ కన్నా ప్రమాదకరంగా మారాయని అన్నారు. ఐసిస్ అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
"ఎక్కడ ప్రమాదం ఎక్కువగా ఉందో అక్కడే మనం దృష్టిసారించాలి. ఉత్తరాఫ్రికా, పశ్చిమాఫ్రికాలో ఉన్న అధిక ముప్పును పట్టించుకోకుండా.. అఫ్గానిస్థాన్‌లో వేల కొద్దీ సైన్యాన్ని మోహరించడం, ట్రిలియన్ డాలర్లను వెచ్చించడం వివేకం కాదు. సిరియాలో ఉగ్రవాదులను ఎదుర్కోగలిగే సామర్థ్యం అమెరికాకు ఉన్నా.. అక్కడ మన సైన్యం తగినంతగా లేదు."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
మరోవైపు, మహిళా హక్కుల పరిరక్షణపైనా కీలక వ్యాఖ్యలు చేశారు బైడెన్. సైనిక బలప్రయోగం ద్వారా మహిళల హక్కులను కాపాడటం సరికాదని చెప్పుకొచ్చారు. దౌత్య, అంతర్జాతీయ ఒత్తిడితోనే అది సాధ్యవడుతుందని అన్నారు.
అఫ్గాన్‌లో చిక్కుకున్న అమెరికన్లందరినీ బయటకు తీసుకొస్తామని బైడెన్ స్పష్టం చేశారు. సైనిక ఉపసంహరణకు చివరి తేదీ అయిన ఆగస్టు 31 తర్వాత కూడా ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
మరో షాక్..
ఇప్పటికే అఫ్గాన్ కోసం కేటాయించిన నిధులపై ఆంక్షలు విధించిన బైడెన్ సర్కారు.. తాలిబన్లకు మరో షాక్ ఇచ్చింది. అఫ్గాన్ ప్రభుత్వానికి ఆయుధాలు విక్రయించడాన్ని నిలిపివేసింది. పెండింగ్‌లో ఉన్న ఆయుధ కాంట్రాక్టులు, డెలివరీ చేయని ఆయుధాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వాటిని సమీక్షించనున్నట్లు తెలిపింది.
'అది అనవసర యుద్ధం'
అమెరికాలోని చాలా మంది ప్రజలు సైతం అఫ్గానిస్థాన్‌లో తమ దేశం యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బైడెన్ విదేశాంగ విధానంపై చాలా వరకు అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ.. ఈ విషయంలో మాత్రం ప్రస్తుత అధ్యక్షుడి అభిప్రాయానికే మొగ్గుచూపినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అసోసియేటెడ్ ప్రెస్-ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ సంయుక్తంగా ఈ సర్వే చేపట్టాయి. ఆగస్టు 12-16 మధ్య సర్వే జరిగింది.
మూడింట రెండొంతుల మంది అమెరికన్లు అఫ్గాన్‌లో యుద్ధం చేయడం వల్ల ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల నిర్వహణలో బైడెన్ పనితీరు బాగుందని 47 శాతం మంది అభిప్రాయం తెలపగా.. 52 శాతం మంది జాతీయ భద్రత విషయంలో బైడెన్ విధానాన్ని స్వాగతించారు. అయితే, రిపబ్లికన్లలో కొంతమంది మాత్రం ఇరాక్, అఫ్గాన్లలో అమెరికా యుద్ధాన్ని సమర్థించారు.
ఇదీ చదవండి: