కరోనా తీవ్రతకు అతలాకుతలమైన అమెరికాకు ఉపశమనం కలిగించేందుకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి తన లక్ష్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం.. తొలిసారిగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారాయన. తాను అధికారంలోకి వచ్చాక తొలి వంద రోజుల్లో 10 కోట్ల డోసు కరోనా టీకాలు అందిస్తామని గతంలో హామీ ఇచ్చారు బైడెన్. ఈ లక్ష్యాన్ని 56 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తమ లక్ష్యాన్ని రెట్టింపు చేసి 20కోట్ల డోసులకు పెంచుతున్నట్టు ఆయన ప్రకటించారు.
"వ్యాక్సిన్ అందించడాన్ని మేం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాం. దాన్ని రెట్టింపు చేయడమే మా అసలు లక్ష్యం. ఇది నెరవేరుతుందని విశ్వసిస్తున్నాం. ఈ విషయంలో ఏ దేశమూ మా దరిదాపుల్లోకి రాలేదు."
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ఈ ఏడాది మే 1నాటికి కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు వృద్ధులందరికీ అర్హత కల్పించాలని ఈ మేరకు ఆదేశించారు బైడెన్. తమ పౌరులు ఈ నెలలో టీకా తీసుకోవడం, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పక్కాగా పాటిస్తే.. జులై 4వ తేదీన చిన్న చిన్న వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుంటుందని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రవెన్షన్ ప్రకారం.. ఇప్పటివరకు ఆ దేశంలో 13.04 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వారం రోజులుగా సగటున రోజుకు 25లక్షల డోసుల టీకా.. లబ్ధిదారులకు అందింది.
ఇదీ చదవండి: కరోనా పుట్టుకపై నాలుగు సిద్ధాంతాలు- ఏది నిజం?
బైడెన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. సుమారు 1,400 ఉద్దీపన చెక్కుల(1.9 ట్రిలియన్ డాలర్ల అమెరికన్ రెస్కూ ప్లాన్ చట్టంలోని భాగం)ను 10కోట్ల చెల్లింపులను ప్రజల ఖాతాలకు మరలించినట్టు సీఎన్ఎన్ వెల్లడించింది. ప్రజల సొమ్ము ప్రజలకు చేరడం ద్వారా వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్న సీఎన్ఎన్.. ఇంకా లక్షలాది మంది త్వరలోనే తమ డబ్బును పొందుతారంది.
భిన్నంగా..
అమెరికాలో గత వందేళ్ల చరిత్రను పరిశీలిస్తే.. బైడెన్ కంటే ముందు అధికారం చేపట్టిన వారు 33 రోజుల్లో సోలో న్యూస్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు సీఎన్ఎన్ విశ్లేషించింది. కానీ బైడెన్ మాత్రం.. అందుకు భిన్నంగా వ్యవహరించారు. వైట్ హౌస్ లేదా అక్కడి సౌత్‌లాన్ నుంచి విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు.
ఇదీ చదవండి: భారత్-రష్యా బంధంపై అమెరికా కీలక వ్యాఖ్యలు