అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్.. డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. 'కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలోనూ మాస్కు ధరించని ట్రంప్.. నిజమైన ఫూల్' అని అభివర్ణించారు. ట్రంప్ నాయకత్వ లోపమే అమెరికాలో లక్షకుపైగా ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమని విమర్శించారు.
'‘బహిరంగ ప్రదేశాల్లో, సమూహాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలని ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ట్రంప్ అలా మాట్లాడటం నిజంగా అతని మూర్ఖత్వానికి నిదర్శనం’' అని ఓ వార్తా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జో బిడెన్.. ట్రంప్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆయన అహంకారపూరిత ప్రవర్తన, తప్పుడు చర్యల ఫలితమే దేశంలో భారీ స్థాయిలో మరణాలకు కారణమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇలా మొదలైంది..
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో మాస్క్ ధరించడం అక్కడ రాజకీయ అంశంగా మారింది. దీనిలో భాగంగా డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు భిన్న మార్గాలను ఎంచుకున్నారు. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన జో బిడెన్ తాజాగా అమెరికా మెమోరియల్ రోజున అక్కడి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో బిడెన్ మాస్కుతో ఉన్న ఫోటోను కొందరు షేర్ చేస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో డొనాల్డ్ ట్రంప్ ఎందుకు మాస్కు ధరించరో ఇది చూస్తే తెలుస్తుందని ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనిపై అమెరికాలో ఇరు పార్టీ అభ్యర్థులు, విశ్లేషకుల మధ్య బహిరంగ చర్చకు దారితీసింది.
'మాస్కు ధరించేది లేదు'
అయితే బహిరంగ కార్యక్రమాల్లో కూడా మాస్కు ధరించబోనని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు అధ్యక్షుడు ట్రంప్. మిచిగాన్‌లోని ఫోర్డ్ కార్ల ప్లాంటును సందర్శించే సమయంలో మాత్రమే స్వల్ప సమయం మాస్కు ధరించారు. ఆ సందర్భంగా 'మీడియా నన్ను ఇలా చూసే అవకాశం కల్పించన'ని పేర్కొనడం గమనార్హం. అమెరికా మెమోరియల్ రోజు కూడా మాస్కు లేకుండానే అక్కడి అధికారిక కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సమయంలో భౌతిక దూరం సాధ్యంకాని ప్రాంతాల్లో, బహిరంగ సమూహాల్లో ముఖానికి తప్పకుండా మాస్కు ధరించాలని అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీపీ) అధ్యక్షుడికి సిఫార్సు చేసింది. కేవలం ఇంట్లో ఉన్న సమయంలోనే మాస్కు ధరించకుండా ఉండవచ్చని సీడీసీపీ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: 'జీ-7 సదస్సు అమెరికా పునరుద్ధరణకు గొప్ప నిదర్శనం'