అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. పర్యావరణం, విద్యుత్తు విభాగాలకు సంబంధించి 'ఆశాజనకమైన పథకాలను' ముందుకు తీసుకెళ్లేందుకు నూతన అధికార సభ్యులను ప్రకటించారు. సభ్యులను 'సరైన బృందం'గా అభివర్ణించారు బైడెన్. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. ఈ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన సభ్యులను ప్రశంసించారు.
సరైన గ్రూపు ఇదే..
న్యూ మెక్సికో ప్రతినిధి డెబ్ హాలండ్‌ను.. ఇంటీరియర్ సెక్రటరీగా నియమించారు. మిషిగన్ మాజీ గవర్నర్ జెన్నిఫర్ గ్రాన్హోమ్ను విద్యుత్తు సెక్రటరీగా నియమించారు. పర్యావరణ సంరక్షణ ఏజెన్సీకి మైకేల్ రేగాన్ను నియమించారు. సెనేట్ రేగాన్ నియామకాన్ని ఆమోదిస్తే.. ఈ పదవిలో నియమితులైన మొదటి నల్ల జాతీయుడిగా ఆయన నిలుస్తారు. జినా మెకార్తిని జాతీయ పర్యావరణ సలహాదారులుగా నియమించారు.
"మిత్రులారా, ప్రస్తుతం మనం కరోనా సంక్షోభంలో ఉన్నాం. కొవిడ్-19ను అరికట్టేందుకు కలిసికట్టుగా పనిచేయాలి. అలాగే పర్యావరణ మార్పుపైనా ఇలాగే సంయుక్తంగా పోరాడాలి. ఎలాంటి జాతీయ అత్యయిక పరిస్థితులు ఎదురైనా మనం సన్నద్ధంగా ఉండాలి.''
-- జో బైడెన్
2035 లోపు అమెరికాలో కర్బన ఉద్గారాలను అరికట్టేందుకు నూతన అధికార సభ్యులు కృషి చేస్తారని బైడెన్ తెలిపారు. 2 ట్రిలియన్ డాలర్లను సౌర విద్యుత్తు ప్రాజెక్టులకు కేటాయిస్తామన్నారు. నూతన సభ్యులను ప్రశంసించిన హారిస్.. వారు కేవలం అనుభవం ఉన్న అధికారులే కాదని, ఎంతో పట్టుదలతో పని చేసేవారని కొనియాడారు. కలుషితమైన నీరు, గాలి వల్ల పేద ప్రజలకే ముప్పు అని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: 'అగ్రరాజ్యంపై సైబర్‌దాడి చైనా పనే'