హెచ్1బీ సహా ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వలసదారుల వేతన సవరణలకు సంబంధించిన నిబంధనల అమలు గడువును మరో 18 నెలలను పొడిగించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా.. ఈ నిబంధనల చట్టబద్ధత, విధానపరమైన సమస్యలను సమగ్రంగా విశ్లేషించేందుకు కార్మిక శాఖకు తగిన సమయం లభించనుంది. వేతన స్థాయి లెక్కింపు విధానాలను నిర్ణయించడం కోసం ప్రజల సూచనలు తీసుకోవడానికీ అధికారులకు గడువు దొరకనుంది.
ఇప్పటికే ఓసారి వీటి అమలును వాయిదా వేశారు. 60 రోజుల పాటు వాయిదా వేయాలని ఇదివరకు నిర్ణయించారు. మరోసారి ఈ నిబంధనల అమలు గడువును పొడిగించే అవకాశం ఉందని ఫిబ్రవరిలోనే కార్మిక శాఖ తెలిపింది. పదిహేను రోజుల పాటు ప్రజల నుంచి సూచనలు స్వీకరించింది.
ట్రంప్ హయాంలో
ఈ కనీస వేతన నిబంధనలను ట్రంప్ సర్కార్ తీసుకొచ్చింది. 2021 జనవరిలో వీటిని ప్రకటించింది సర్కార్. హెచ్1బీ, హెచ్1బీ1, ఈ3 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల ద్వారా.. తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను చేర్చుకునే యజమానుల కోసం ఈ విధానాలు రూపొందించారు.
సాధారణంగా హెచ్1-బీ వీసా పొందాలంటే వార్షికవేతనం కనీసం 65 వేల డాలర్లకుపైగా ఉండాలి. ట్రంప్ హయాంలో ఈ పరిమితిని 1.10 లక్షల డాలర్లకు (45 శాతం) పెంచాలని ప్రతిపాదించారు. దీని వల్ల అమెరికా పౌరులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: హెచ్1-బీ వీసాలపై బైడెన్ మరో కీలక నిర్ణయం!