అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన 'ఏ ప్రామిస్డ్ లాండ్' అనే పుస్తకంలో భారత్తో తనకు ఉన్న అనుబంధాన్ని బయటపెట్టారు. తన బాల్యం ఇండోనేసియాలో గడపడం వల్ల రామాయణం, మహాభారతం వంటి పురాణాల ప్రభావం ఉందని చెప్పుకొచ్చారు. భారతీయులు ఎక్కువ మంది స్నేహితులుగా ఉండడం కారణంగా బాలీవుడ్ సినిమాలు కూడా బాగా చూస్తానని తెలిపారు.
భారతీయ వంటకాలైన పప్పు, కీమా చేయడం తెలుసుని పుస్తకంలో పేర్కొన్నారు ఒబామా.
"ఇండోనేసియాలో నా చిన్నతనం గడిచింది. రామాయణం, మహాభారతం లాంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగాను. ఈ విధంగా నాకు భారత్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రపంచ జనాభాలో ఆరోవంతు ప్రజలు భారత్లో ఉంటారు. రెండువేలకు పైగా విభిన్న జాతులు ఉన్నాయి. ఏడు వందలకు పైగా భాషలు మాట్లాడుతారు. ఇలా భారత్ ఓ సంపూర్ణ దేశంగా చెప్పవచ్చు."
- బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు
గాంధీ తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేశారని ఒబామా పేర్కొన్నారు. గాంధీ పట్ల తనకున్న అభిమానం, ఆరాధనను తాజా పుస్తకంలో ఒబామా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
గాంధీ రచనలే నా భావాలకు స్వరాన్నిచ్చాయి..
"అన్నింటి కంటే ముఖ్యంగా నాకు భారత్ పట్ల మక్కువ కలగడానికి కారణం మహత్మా గాంధీ. అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాతో పాటు గాంధీ నా ఆలోచనల్ని ఎంతో ప్రభావితం చేశారు. ఓ యువకుడిగా ఆయన రచనలను అధ్యయనం చేస్తుంటే నాలోని లోతైన భావాలకు స్వరం ఇస్తున్నట్లు అనిపించేది. గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహం, సత్యనిష్ఠ, మనస్సాక్షిని కదిలించే అహింసామార్గం, మతపరమైన ఐక్యత, ప్రతిఒక్కరికీ సమాన గౌరవం దక్కేలా రాజకీయ, సామాజిక, ఆర్థికపరమైన ఏర్పాట్లు చేయాలన్న పట్టుదల నాలో ప్రతిధ్వనించేవి. ఆయన మాటల కంటే చేతలు నన్ను ప్రభావితం చేశాయి. జైలుకు వెళ్లడం, జీవితాన్నే పణంగా పెట్టడం, ప్రజా పోరాటాల్లో నిమగ్నమవడం ద్వారా ఆయన సిద్ధాంతాలకు ఆయనే పరీక్ష పెట్టుకునేవారు"
- బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు
గాంధీజీ పోరాటం కేవలం భారత్‌కు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా యావత్తు ప్రపంచాన్నే ప్రభావితం చేసిందని ఒబామా గుర్తుచేశారు. అమెరికాలో నల్లజాతీయులు తమ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటానికి దారి చూపిందన్నారు. 2010లో భారత పర్యటనకు వచ్చినప్పుడు ముంబయిలోని గాంధీ నివాసం మణి భవన్‌లో గడిపిన క్షణాల్ని పుస్తకంలో ఒబామా కొంత ఉద్వేగంతో ప్రస్తావించారు.
"చెప్పులు వదిలి మేం లోపలికి ప్రవేశించాం. ఆయన ఉపయోగించిన మంచం, చరఖాలు, పాత కాలపు ఫోన్, రాయడానికి ఉపయోగించిన బల్లను చూస్తూ ఉండిపోయాను. ఖాదీ దోతి ధరించి గోధుమ వర్ణంలో ఉన్న ఓ వ్యక్తి కాళ్లు ముడుచుకొని బ్రిటీష్ అధికారులకు లేఖ రాస్తున్నట్లు ఊహించుకునే ప్రయత్నం చేశాను. ఆ సమయంలో నాకు ఆయన పక్కన కూర్చొని మాట్లాడాలనే బలమైన కోరిక కలిగింది. అత్యంత తక్కువ వనరులతో ఇంత బలం, స్ఫూర్తి ఎక్కడ నుంచి పొందారని అడగాలనిపించింది. నిరాశ నుంచి ఎలా కోలుకునేవారో తెలుసుకోవాలనిపించింది"
- బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు
ఒబామా రాసిన ఈ పుస్తకం రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా మంగళవారం విడుదలైంది.