తమ దేశంలో నిర్వహించిన ఆస్ట్రాజెనెకా క్లినికల్ ప్రయోగాల వివరాలపై అమెరికాలో అనుమానాలు వ్యక్తమైన వేళ.. కరోనా కట్టడిలో తమ వ్యాక్సిన్ 76శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆస్ట్రాజెనెకా స్పష్టం చేసింది. యూఎస్ అధ్యయనంలో పేర్కొన్న అనారోగ్యానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని లెక్కించిన తర్వాత తమ టీకా 76 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆస్జ్రాజెనెకా తెలిపింది.
అమెరికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లలో తమ టీకా 79శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆస్జ్రాజెనెకా గతవారం వెల్లడించింది. అయితే క్లినికల్ ప్రయోగాలకు సంబంధించిన వివరాల్లో ఆస్ట్రాజెనెకా పాత డేటానూ వినియోగించి ఉండొచ్చని ఓ స్వతంత్ర కమిటీ ఆరోపించింది. కొన్ని కరోనా కేసులను ఆస్జ్రాజెనెకా విస్మరించిందంటూ ఆస్జ్రాజెనెకా యాజమాన్యం సహా అమెరికా ఆరోగ్యశాఖ అధికారులకు లేఖ రాసింది. దీంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పాలసీ అధికారులు ఈ అంశంపై ఆస్ట్రాజెనెకా వివరణ కోరారు. ఈ నేపథ్యంలో అధ్యయనంలోని వివరాలను లెక్కించిన తర్వాత తమ టీకా 76శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా స్పష్టం చేస్తూ రాత్రి ప్రకటన విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 50కిపైగా దేశాలు ఆస్ట్రాజెనెకా టీకాకు అనుమతులు ఇచ్చాయి.
ఇదీ చదవండి:బ్రెజిల్లో కరోనా మరణ మృదంగం