అంతరిక్షంలో మరో ఆస్టరాయిడ్ భూమివైపు దూసుకొస్తోంది. 22 నుంచి 49 మీటర్ల వ్యాసం ఉన్న ఈ గ్రహ శకలం చంద్రుని కన్నా దగ్గరి నుంచే భూమిని దాటనుంది. ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం లేదని నాసా స్పష్టం చేసింది.
సెకనుకు 8.16 కి.మీ.ల వేగంతో ఆస్టరాయిడ్ ప్రయాణిస్తున్నట్లు నాసా అంచనా వేసింది. సెప్టెంబర్ 1న ఇది భూమిని దాటుతుందని అంచనా వేసింది. దీనిని అధికారికంగా 2011ఈఎస్4గా పిలుస్తున్నారు.
"2011 ఈఎస్4 ఆస్టరాయిడ్ భూమిని ఢీకొడుతుందా? లేదు. ఖగోళ స్థాయిలో చూసుకుంటే గ్రహశకలం చాలా దగ్గర్లో నుంచి వెళ్తున్నట్లే. కానీ భూమిని తాకే ప్రమాదం లేదు. సెప్టెంబర్ 1న భూమి నుంచి కనీసం 45 మైళ్ల దూరం నుంచి వెళ్లిపోతుందని నిపుణుల అంచనా."
-నాసా
గతంలో ఈ ఆస్టరాయిడ్ భూమికి సమీపానికి వచ్చినప్పుడు నాలుగు రోజుల పాటు కనువిందు చేసినట్లు నాసా గుర్తు చేసింది. ఈసారి 1.2 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి 2011 ఈఎస్4 ఆస్టరాయిడ్ వెళ్తుందని అంచనా వేసింది.
2011లో దీనిని గుర్తించారు శాస్త్రవేత్తలు. దీనిని ప్రమాదకర గ్రహశకలంగా పరిగణిస్తారు. ప్రతీ 9 సంవత్సరాలకు ఇది భూమికి సమీపానికి వస్తుంది.
ఎన్నికలకు ముందు
భూమివైపు వస్తున్న ఓ గ్రహ శకలాన్ని ఇప్పటికే నాసా గుర్తించింది. అమెరికా ఎన్నికలకు ఒక్కరోజు ముందు అయిన నవంబర్ 2న భూమికి సమీపానికి వస్తుందని తెలిపింది. అయితే భూమిని ఢీకొట్టే అవకాశం చాలా తక్కువ అని స్పష్టం చేసింది.