బ్రెజిల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటోంది. ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 5 లక్షలు దాటిపోయింది. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారోకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వైరస్‌ను అడ్డుకోవడంలో బొల్సొనారో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
రియో డీ జెనీరోలో వేలాది మంది నిరసనకారులు బ్రెజిల్ జాతీయ జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. 'గెట్ అవుట్ బొల్సొనారో' అనే ప్లకార్డులతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బొల్సొనారో ప్రభుత్వంలో నిరుద్యోగం, ఆకలి కేకలు పెరిగినట్లు గుర్తు చేశారు. 5 లక్షల మందికి చావుకు అధ్యక్షుడే కారణమని చెప్పే బ్యానర్లను ప్రదర్శించారు.
"కరోనా.. బ్రెజిల్‌కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. నిజానికి టీకా పంపిణీలో ఇది ఒక ఆదర్శమైన దేశం. అందుకుగాను ఇక్కడ గుర్తింపు పొందిన సంస్థలు చాలా ఉన్నాయి. అయినా ఈ రోజు దేశంలో విచారకరమైన పరిస్థితి నెలకొని ఉంది."
- ఇసాబెలా గౌల్జోర్, విద్యార్థి
బ్రెజిల్‌లోని అన్ని రాష్ట్రాల్లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష రేసులో బొల్సొనారో పోల్రేట్ తగ్గుముఖం పట్టుతుండడం వల్ల అక్కడి ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసనకారులను ప్రోత్సహిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. మే నెలలో బొల్సొనారో మద్దతుదారులు సైతం ఇలాగే రోడ్లపైకి వచ్చి అధ్యక్షుడికి అనుకూలంగా ప్రదర్శన చేపట్టారు. లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ బొల్సొనారో తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. లాక్‌డౌన్‌తో వ్యాపారాలు బాగా నష్టపోయినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రూ. 23 వేల కోట్ల మాత్రలతో కరోనాకు చెక్!