2020లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయబోనని చెప్పారు మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్.
" నేను పారిపోవడం లేదు. నమ్మిన సిద్ధాంతాల కోసం నేను పని చేస్తూనే ఉంటా. మాట్లాడుతూనే ఉంటా" అని స్పష్టం చేశారు. అమెరికాలోని ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
2016 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయారు హిల్లరీ. ఆ ఎన్నికల్లో ఆమె గెలుస్తారని చాలా మంది అంచనా వేశారు. కానీ అవన్నీ తలకిందులయ్యాయి.
"నేనెక్కడికీ వెళ్లను. అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నన్ను చాలా ఆవేదనకు గురి చేస్తున్నాయి. నేను సమస్యలపై గొంతుక వినిపిస్తానని నా అమెరికా ప్రజలకు హమీ ఇస్తున్నా. " -హిల్లరీ క్లింటన్
అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న కొందరు డెమొక్రాట్లతో హిల్లరీ ఇటీవలే భేటీ అయ్యారు. పోటీ చేయాలనుకుంటున్న వారిలో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.
" ప్రస్తుత ప్రభుత్వం చాలా హామీలను విస్మరించింది. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల చిట్టా చాలా పెద్దగా ఉంది. వాటిని వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది." -- హిల్లరీ క్లింటన్
ఏదైనా పదవిలో ఉండాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు హిల్లరీ.
" నేను ఏ పదవిలో ఉండాలనుకోవడం లేదు. నాకు న్యూయార్క్ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం నుంచి గతంలో సెనేటర్‌గా ఎనిమిదేళ్ల పాటు ప్రజలకు సేవలందించటం, వారితో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నా." -- హిల్లరీ క్లింటన్