అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ నిర్వహించిన పోల్‌లో తేలింది. జాతీయ సంక్షోభ పరిస్థితులు తలత్తిన సమయంలో ప్రజలను ఏకం చేయాల్సింది పోయి ఉద్రిక్తతలను పెంచేలా ట్రంప్ వ్యవహరిస్తున్నారని పోల్‌లో పాల్గొన్న మెజారిటీ ప్రజలు భావించారు. ట్రంప్ సొంతపార్టీ రిపబ్లికన్‌కు చెందిన 63శాతం మంది కూడా ప్రస్తుతం అమెరికా సరైన మార్గంలో వెళ్లడం లేదని అభిప్రాయపడ్డారు.
అధ్యక్ష ఎన్నికలకు ఐదు నెలలు మాత్రమే గడువున్న తరుణంలో చరిత్రలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది అమెరికా. కరోనా మహమ్మారి, ఆర్థిక సంక్షోభం, జార్జి ప్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా నల్లజాతీయుల తీవ్ర ఆందోళనలు వంటి సమస్యలు తలెత్తాయి. వీటిని అధిగమించడంలో ట్రంప్ విఫలమయ్యారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. పోల్‌లో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది సహా సహా 37శాతం మంది రిపబ్లికన్లు అమెరికా ప్రజలను ట్రంప్ మరింత విభజించాలని చూస్తున్నట్లు తెలిపారు.
సంక్షోభ సమయంలో ప్రజల్ని ఏకం చేయాల్సింది పోయి విడదీసే విధంగా ట్రంప్ వ్వవహరిస్తున్నారని 63ఏళ్ల డొనా ఓట్స్ అసహనం వ్యక్తం చేశారు. ట్రంప్ తీరు నచ్చక ఆమె ఇటీవలే రిపబ్లికన్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకుని డెమొక్రటిక్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.
పోల్ వివరాలు..
- ప్రస్తుతం అమెరికా సరైన మార్గంలోనే ఉందని 24మంది మాత్రమే భావిస్తున్నారు. గత నెలలో ఇది 33శాతంగా ఉండగా.. మార్చిలో 42శాతంగా ఉంది.
- కరోనా మహమ్మారి కట్టడి విషయంలో ట్రంప్ సరిగ్గా వ్యవహరించారని 37 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. మార్చిలో ఇది 44 శాతంగా ఉంది.
- జార్జి ఫ్లాయిడ్ మరణం అనంతరం ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ట్రంప్ పరిస్థితులను మరింత భయానకంగా మార్చారని 54 శాతం మంది భావించారు.
- నల్ల జాతీయుల్లో 72 శాతం మంది, శ్వేత జాతీయుల్లో 51 శాతం మంది ట్రంప్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ట్రంప్‌పై బిడెన్ 12 పాయింట్ల ఆధిక్యం..
అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రాట్ల తరఫున బరిలో నిలవనున్న జో బిడెన్‌వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు ప్రముఖ ఫాక్స్ న్యూస్ ఒపీనియన్ పోల్ స్పష్టం చేస్తోంది. ఈ పోల్‌లో ట్రంప్‌పై బిడెన్ 12 పాయింట్ల ఆధిక్యంలో నిలిచారు. దేశ స్థిరత్వానికి జాత్యహంకారం, నిరుద్యోగం, కరోనా వైరస్ అంశాలే ప్రధాన ముప్పు అని ఒపీనియన్ పోల్‌లో పాల్గొన్న ఓటర్లు చెప్పారు. ఫాక్స్ న్యూస్ ట్రంప్‌కు ఇష్టమైన ఛానల్ కావడం గమనార్హం.
జూన్13 నుంచి 16మధ్య ఈ ఒపీనియన్ పోల్‌ను నిర్వహించినట్లు ఫాక్స్ న్యూస్ తెలిపింది. 50 శాతం మంది బిడెన్‌కు మద్దతుగా ఉండగా.. 38శాతం మంది మాత్రమే ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది.