కరోనా తొలుత మనుషులకు ఎలా సోకిందనే విషయంపై డబ్ల్యూహెచ్ఓ-చైనా సంయుక్తంగా నిర్వహించిన పరిశోధన కీలక విషయాలను వెల్లడించింది. జంతువుల ద్వారానే గబ్బిలాల నుంచి మనుషుల్లోకి వైరస్ ప్రవేశించి ఉంటుందని పేర్కొంది. ప్రయోగశాల నుంచి వైరస్ లీక్ అయి ఉండకపోవచ్చని తెలిపింది. ఈ మేరకు పరిశోధకులు రూపొందించిన మూసాయిదాను ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) విశ్లేషించింది.
ముందుగా ఊహించిన అంశాలే దర్యాప్తులో వెల్లడయ్యాయని ఏపీ పేర్కొంది. అనేక ప్రశ్నలకు సమాధానం దొరకలేదని తెలిపింది. ల్యాబ్ లీక్ గురించి తప్ప మిగిలిన అన్ని కోణాల్లో మరింత దర్యాప్తు చేసేందుకు పరిశోధక బృందాలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది.
దాదాపు తుది దశలో ఉన్న ముసాయిదా తమకు అందిందని ఏపీ తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ సభ్యదేశ దౌత్యవేత్త నుంచి దాన్ని స్వీకరించినట్లు వెల్లడించింది. విడుదలకు ముందు ఈ నివేదికలో మార్పులు చేస్తారా? లేదా? అన్న విషయం తెలియదని పేర్కొంది.
ముసాయిదాలో ఏముందంటే?
కరోనా వ్యాప్తి సంభావ్యత ఆధారంగా నాలుగు సందర్భాలను ప్రస్తావించారు పరిశోధకులు. జంతువుల ద్వారా కరోనా వ్యాప్తి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు సోకిన విషయాన్నీ తోసిపుచ్చలేదు. కోల్డ్ చైన్ ఆహార పదార్థాల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి జరిగడం సాధ్యమేనని.. కానీ, అందుకు అవకాశం ఉండకపోవచ్చని తెలిపారు.
కొవిడ్‌కు అత్యంత దగ్గర లక్షణాలు ఉన్న వైరస్‌ను గబ్బిలాల్లో ఇదివరకే గుర్తించారు పరిశోధకులు. అయితే, గబ్బిలాల వైరస్, సార్స్-కోవ్-2 ఆవిర్భావానికి మధ్య దశాబ్దాల వ్యత్యాసం ఉందని డబ్ల్యూహెచ్ఓ-చైనా పరిశోధకులు చెబుతున్నారు. పంగోలిన్లలో కొవిడ్‌ను పోలి ఉన్న వైరస్ బయటపడిందని... పిల్లులు, మింక్లపైనా కరోనా ప్రభావం ఉందని చెప్పారు. ఈ జంతువులు కూడా వైరస్ వాహకాలు అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
ఆలస్యం వెనక మర్మమేంటి?
నివేదికను త్వరలోనే విడుదల చేస్తామని గతవారం డబ్ల్యూహెచ్ఓ అధికారి వెల్లడించారు. అయితే ఇప్పటికీ దర్యాప్తు నివేదిక విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో.. కరోనా ఆవిర్భావానికి కారణమని తనపై వస్తున్న తీర్మానాలను వక్రీకరించేందుకు చైనా ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: 'కరోనా పట్ల చైనా, డబ్ల్యూహెచ్ఓ అలసత్వం'