కరోనా యాంటీబాడీలకు సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించారు శాస్త్రవేత్తలు. స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడిన వ్యక్తుల్లో యాంటీబాడీలు మొదటి 3 నెలల్లో భారీగా క్షీణిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి 73 రోజులకు వీటి సంఖ్య 50శాతం వరకు పడిపోతున్నట్లు తెలిపారు.
అమెరికాలోని యూనివర్సిటీ ఆప్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ శాస్త్రవేత్తలు సహా పలువురు శాస్త్రజ్ఞులు జరిపిన పరిశోధనకు సంబంధించిన వివరాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి.
ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో కరోనా వైరస్‌పై పోరాడే యాంటీబాడీలు కొద్ది కాలం మాత్రమే జీవిస్తాయని వెల్లడైంది. అయితే ఎన్ని రోజుల పాటు అవి మనుగడలో ఉంటాయనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఏ నిష్పత్తిలో నశిస్తాయనే వివరాలనూ ఎవరూ పొందుపరచలేదు.
తాజాగా జరిపిన పరిశోధనలో కరోనా సోకిన వారిలో యాంటీబాడీలు ఏడాది కాలంలో నశిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రతి 73 రోజులకు యాంటీబాడీల సంఖ్య సగానికి పడిపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ విధంగా అంచనా వేయడం ఇదే తొలిసారి.
కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్న 20మంది మహిళలు, 14మంది పురుషులపై పరిశోధన జరిపి ఈ వివరాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. వ్యాధి సోకిన తర్వాత సగటున 36 రోజులు, 86 రోజులకు వారి రక్త నమూనాలు పరీక్షించారు.
కరోనాపై పోరాడే యాంటీబాడీలు ఎక్కువ కాలం జీవించలేకపోవడం ఆందోళనకరమన్నారు శాస్త్రవేత్తలు. 90రోజుల తర్వాత వాటి సంఖ్య ఎలా ఉంటుందనే విషయంపై పరిశోధన జరపాల్సి ఉందన్నారు.