అమెరికాలో ఒకవైపు నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గరపడుతుండగా.. మరోవైపు రోజురోజుకూ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. క్యాపిటల్ భవనంపై అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదార్లు దాడి చేసిననాటి నుంచి పరిస్థితులు అనూహ్యంగా తయారయ్యాయి. ప్రతినిధుల సభలో ట్రంప్‌పై సోమవారం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి డెమొక్రాట్లు సన్నాహాలు చేస్తుండడం కీలక విషయం. ఇందుకు ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ సభ్యులే మద్దతు తెలుపుతుండడం గమనార్హం.
మరోవైపు 25వ రాజ్యాంగ సవరణ కింద ట్రంప్‌ను తొలగించే అంశాన్ని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. క్యాపిటల్‌పై దాడి జరిగిన నాటి నుంచి పెన్స్‌తో ట్రంప్ మాట్లాడడం లేదు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఆమోదం తెలపడానికి ఆ రోజున క్యాపిటల్ భవనంలోనే ఉభయసభల సంయుక్త సమావేశం జరిగింది. దీనికి పెన్స్ ఆధ్వర్యం వహించారు. ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికే ట్రంప్ తన మద్దతుదార్లను రెచ్చగొట్టారు. ఈ సందర్భంగా పెన్స్ భద్రత గురించి ట్రంప్ పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ సమావేశంలో తనకు అనుకూలంగా వ్యవహరించలేదంటూ పెన్స్‌పై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. అధ్యక్షుడిగా ఉంటూ హింసను రెచ్చగొట్టినందున ట్రంప్‌ను వెంటనే తొలగించాలని, ఇందుకు 25వ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకోవాలని పెన్స్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయి. ట్రంప్ చర్యలు మరీ భరించరానివిగా తయారయితే వీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రయత్నం వద్దంటూ రిపబ్లికన్‌లలో కొందరు ఆయనకు నచ్చజెప్పుతున్నట్టు సమాచారం. ఇలా చేస్తే ట్రంప్ మరింతగా రెచ్చగొడుతారని, అప్పుడు ప్రజల్లో మరింత విభజన వస్తుందని అంటున్నారు. క్యాపిటల్ భవనంపై దాడిని చాలా మంది రిపబ్లికన్లు కూడా అంగీకరించడం లేదు.
ట్రంప్ తిరుగుబాటును ప్రోత్సహించారని ఆరోపిస్తూ దిగువ సభలో డెమొక్రాటిక్ పార్టీ సభా నాయకుడు డేవిడ్ సిసిలీన్ అభిశంసన తీర్మానాన్ని (ఇంపీచ్‌మెంట్ ఆర్టికల్స్)ను రాశారు. దీనికి 185 మంది మద్దతు తెలిపారు. బుధవారం దీనిపై ఓటింగ్ జరగనుంది. అనంతరం సెనేట్‌కు పంపిస్తారు. ఆయనను పదవి నుంచి తొలగించాలా, వద్దా అనే దానిపై అక్కడ నిర్ణయిస్తారు.
కొత్త సామాజిక మాధ్యమేది?
ట్రంప్ సామాజిక మాధ్యమం ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా రద్దు చేసింది. నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం వరకు తమ ఖాతాలను వాడుకోవడానికి వీల్లేదంటూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలు ఆంక్షలు పెట్టాయి. స్నాప్‌ఛాట్, షోపిఫీ, రెడ్డిట్‌లు కూడా ఇదే పని చేశాయి. దాంతో పార్లెర్‌పై ఆయన దృష్టి పెట్టారు. అయితే తమ మాధ్యమం ద్వారా వ్యవహారాలను నడపడానికి గూగుల్, ఆపిల్, అమెజాన్‌లు పార్లెర్‌కు అవకాశం ఇవ్వలేదు. దాంతో బడా టెక్నాలజీ కంపెనీలన్నీ కుమ్మక్కయి మార్కెట్‌లో పోటీ లేకుండా చేస్తున్నారని పార్లెర్ సీఈఓ జాన్ మాట్జే ఆరోపించారు. గ్యాబ్ అనే మరోసంస్థను ట్రంప్ సంప్రదించారు. కానీ దానికి కూడా గూగుల్, ఆపిల్‌లు ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఇవ్వడానికి నిరాకరించాయి.
ఇదీ చూడండి: అధ్యక్షుడిగా ట్రంప్ చివరి పర్యటన అక్కడికే!