ప్రపంచ దేశాలను కరోనా టీకాల కొరత సమస్య వేధిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక సూచనలు జారీ చేసింది. ఫైజర్-బయోఎన్‌టెక్ టీకా డోసుల మధ్య వ్యవధి 6 వారాల వరకు ఉండొచ్చని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓకు చెందిన వ్యూహాత్మక సలహా బృందం పేర్కొంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అనేక దేశాలు టీకా కొరతతో ఉన్నందున.. రెండో డోసును కాస్త వాయిదా వేసే అంశంపై పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తన సూచనల్లో తెలిపింది. ఈ ఆచరణాత్మక విధానాన్ని వివిధ అంటువ్యాధులపై అధ్యయనం చేసేందుకు వినియోగిస్తామని చెప్పింది. ప్రస్తుత క్లినికల్ ట్రయల్స్ సమాచారం ఆధారంగా.. ఫైజర్ టీకా డోసుల మధ్య వ్యవధిని 42 రోజులకు పెంచవచ్చని సూచించింది. అయితే దీన్ని నిర్ధరించడానికి మరింత సమాచారం కావాల్సి ఉంటుందని వివరించింది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆరునెలల్లో మళ్లీ కరోనా బారిన పడే అవకాశాలు అరుదుగా ఉంటాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అందువల్ల ఈ ఆరునెలల్లో కరోనా సోకిన వారు టీకా తీసుకోవడాన్ని వాయిదా వేయొచ్చని సూచించింది. రెండో డోసు(బూస్టర్ డోసు) ఆవశ్యకతపై ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. టీకాల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుందనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పింది.
ఇదీ చూడండి:మోడెర్నా టీకాకు బ్రిటన్ ఓకే