కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో 31లక్షలు దాటిపోయాయి. మరిన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు వస్తున్నాయి. ఫ్లోరిడాలో ఐసీయూ పడకలకు తీవ్ర కొరత తలెత్తింది. టెక్సస్‌లోని ఆసుపత్రుల్లో చేరిన బాధితుల సంఖ్య రెండు వారాల్లోనే రెట్టింపు అయింది. దాదాపు 25 రాష్ట్రాల్లో కేసుల తాకిడి గణనీయంగా ఉంది. వైరస్‌కు కళ్లెం వేసేందుకు చేపట్టిన చర్యలు అంతగా ఫలించలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. కాలిఫోర్నియా, హవాయీ, టెక్సస్, ఓక్లహామా వంటి రాష్ట్రాలు మునుపటి రికార్డుల్ని తిరిగరాస్తున్నాయి.
కారులోనే నిరీక్షణ...
కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కిందికి దిగకుండా కారుల్లోనే నిరీక్షించే వీలుండటం వల్ల చాలామంది ముందు రోజు రాత్రి నుంచే తమ వాహనాన్ని వరుసలో నిలబెడుతున్నారు. రాత్రంతా వాటిలోనే నిద్రపోతున్నారు. ఆరిజోనాలో పాజిటివ్ కేసులు 26శాతానికి పెరిగాయి. అమెరికాలో బడులను త్వరలో తెరిచేలా రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తానని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తల్లిదండ్రులు, పిల్లలతో సహా అంతా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు.
ప్రపంచంలో...
- ఆఫ్రికాలో కేసులు 5లక్షలు దాటాయి. 130 కోట్ల జనాభా ఉన్న ఆఫ్రికాలో పలు దేశాలు కరోనా పరీక్షల కిట్లకు తీవ్ర కొరత ఉంది.
- పాకిస్థాన్‌లో కరోనా మృతుల సంఖ్య 5000కు చేరువైంది. ఈ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో వ్యూహాలను తమతో పంచుకోవాల్సిందిగా ప్రధాన ఇమ్రాన్‌ఖాన్ ప్రపంచ దేశాలను కోరారు.
- లాక్‌డౌన్‌ను సడలించాక ఫిలిప్పీన్స్‌లో కేసులు 50వేలకు పెరిగాయి.
ఇదీ చూడండి:- అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ- నలుగురు మృతి