అమెరికాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో లాటరీ టిక్కెట్లు అమ్ముడవుతుంటాయి. అయితే లాటరీ తగలడం అనేది అదృష్టంపై అధారపడి ఉంటుంది. ఈ క్రమంలో కేవలం తన అదృష్టాన్నే నమ్ముకున్నాడో వ్యక్తి. ఒకే సంఖ్య తనకు సిరులు తెచ్చిపెడుతుందని బలంగా విశ్వసించాడు. దాదాపు ముప్పై ఏళ్లపాటు క్రమం తప్పకుండా ఒకే నెంబర్‌పై లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు. అన్నేళ్లు వరించని అదృష్టం ఇటీవలే అతన్ని పలకరించింది. దీనికి సంబంధించిన ఆసక్తికర కథనం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
అమెరికాకు చెందిన ఓ లాటరీ సంస్థ ఈ వారం విజేతలను ప్రకటించింది. అదే సమయంలో ఓ ఆసక్తికర అంశాన్నీ వెల్లడించింది. ఈసారి లాటరీలో జాక్‌పాట్ కొట్టిన మిచిగాన్కు చెందిన ఓ వ్యక్తి గత 30 ఏళ్లుగా అదే నెంబర్‌పై లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడని తెలిపింది. మొండితనం, ఆశ కారణంగానే ఆ 61 ఏళ్ల వ్యక్తి ఇలా చేశాడని పేర్కొంది.
"నేను 1991 నుంచి ఒకే సెట్ లాటరీ టిక్కెట్ కొనుగోలు చేస్తున్నా. కానీ.. ఇప్పటివరకు నేను నగదు గెలచుకోలేదు. చాలాసార్లు వేరే నెంబర్ కొనుగోలు గురించి ఆలోచించా. కానీ ప్రతిసారి మొండిగా ఈ సెట్‌నే కొంటూ ఉండిపోయా."
-లాటరీ గెలిచిన వ్యక్తి
తాజా లాటరీలో దాదాపు రూ.135 కోట్లు గెలుచుకున్న ఆ వ్యక్తి మీడియాతో మాట్లాడాడు. "మూడు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ఇంత భారీ మొత్తం గెలిచానంటే నమ్మలేకపోతున్నా" అని తెలిపాడు.
ఈ మొత్తం నుంచి దాదాపు రూ.86 కోట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అతను తెలిపాడు. ఇందులో నుంచి కొంతమొత్తాన్ని తన కుటుంబానికి వెచ్చిస్తానని.. మిగిలిన మొత్తం పొదుపు చేస్తానని తెలిపాడు. ఆపై కొంత నగదును స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించాడు.
ఇవీ చదవండి: