అంతరిక్షంలో ఆధిపత్యం చాటుకోవడానికి అమెరికా ముందడుగు వేసింది. రష్యా, చైనాల నుంచి ఎదురవుతున్న 'స్పేస్ వార్' సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు.. అంతరిక్ష దళాన్ని (స్పేస్ ఫోర్స్) ఏర్పాటు చేసింది. వైమానిక దళంలో ఇది ప్రత్యేక విభాగంగా ఉండనుంది. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ఆమోదించి పంపిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (యెన్డీఏఏ)-2020 బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సంతకం చేశారు. 1947లో అమెరికా వైమానిక దళం అంకురించగా, దాని ఆధ్వర్యంలో మరో ప్రత్యేక విభాగం ఏర్పడటం ఇదే తొలిసారి.
ఎందుకిది?
పొరుగు దేశాల కార్యకలాపాలు, రహస్యాలపై నిఘా ఉంచే ఉపగ్రహాలను పలు దేశాలు అంతరిక్షంలోకి పంపుతున్నాయి. ఈ క్రమంలోనే చైనా, రష్యాలు ఉపగ్రహాలను నాశనం చేయగల క్షిపణులను అభివృద్ధి చేయడం అమెరికాకు మింగుడు పడటంలేదు. అంతరిక్షంలో ఎలాగైనా తన ఆధిపత్యాన్ని చాటుకునే లక్ష్యంతో అమెరికా ఈ స్పేస్ ఫోర్స్ ఆలోచన చేసింది.
2018లోనే యోచన
అంతరిక్షంలో ఆధిపత్యం కోసం అధ్యక్షుడు ట్రంప్ 2018 జూన్‌లోనే స్పేస్ సర్వీస్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీన్ని సుసాధ్యం చేసేలా ప్రణాళికను రచించే బాధ్యతను పెంటగాన్‌కు అప్పగించారు. అదే ఇప్పుడు స్పేస్ ఫోర్స్‌కు నాంది పలికింది. ఇందుకు సంబంధించిన ఎన్డీఏఏ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపినందున ట్రంప్ రాజకీయంగా భారీ విజయం మూటగట్టుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
సుమారు రూ.52.44 లక్షల కోట్లు..
ఈ అంతరిక్ష దళం కోసం 738 బిలియన్ డాలర్లు (సుమారు రూ.52.44 లక్షల కోట్లు) విలువైన ప్రతిపాదనలు చేసింది ఎన్డీఏఏ. అంతేకాదు స్పేస్ ఫోర్స్ చేరికతో అమెరికా ఎయిర్ ఫోర్స్ స్పేస్ కమాండ్ పేరు 'యూఎస్ స్పేస్ ఫోర్స్'గా మారింది. ఈ విభాగం తొలి అధిపతి (ద చీఫ్ ఆఫ్ స్పేస్ ఆపరేషన్)గా ఎయిర్‌ఫోర్స్ జనరల్ జాన్ రేమండ్ వ్యవహరిస్తారు.
గొప్ప ముందడుగు
స్పేస్ ఫోర్స్ ఏర్పాటుపై అధ్యక్షుడు ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదొక మహోన్నత ఘట్టమని.. అమెరికా రక్షణ దళాల్లో ఆరోశాఖగా దీన్ని నెలకొల్పడం ద్వారా గొప్ప ముందడుగు వేశామని తెలిపారు.