కొవిడ్-19 బాధితుల చికిత్స కోసం ప్లాస్మాను ఉపయోగించడానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర ఆమోదం తెలిపింది. ఈ విధానంతో పొంచి ఉన్న ముప్పుల కన్నా కలిగే ప్రయోజనాలే చాలా ఎక్కువని పేర్కొంది. ఆసుపత్రిపాలైన కరోనా బాధితుల చికిత్స కోసం ప్రయోగాత్మకంగా కాన్వలసెంట్ ప్లాస్మాను ఉపయోగించేందుకు గతంలో అత్యవసర అనుమతి ఇచ్చినట్లు ఎఫ్‌డీఏ తెలిపింది. ఆ ప్రయోగాల్లో వెలువడిన శాస్త్రీయ డేటాను విశ్లేషించి, దీన్ని చికిత్సా విధానంగా అనుమతించాలని తాజాగా నిర్ణయించినట్లు పేర్కొంది. ఇప్పటివరకూ దేశంలో 70 వేల మందికిపైగా బాధితులకు ఈ చికిత్స చేశారని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ఈ ప్లాస్మాను సేకరిస్తారు. ఇందులో వైరస్‌తో పోరాడే యాంటీబాడీలు ఉంటాయి.
ఎఫ్‌డీఏ తీసుకున్న తాజా నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. అంతకుముందు రోజు ఆయన ఎఫ్‌డీఏపై విరుచుకుపడుతూ ట్వీట్లు చేశారు. రాజకీయ కారణాలతో టీకాలు, చికిత్స విధానాలకు సంస్థ అడ్డుపడుతోందని మండిపడ్డారు.
వ్యాధిని నిర్ధరించిన మూడు రోజుల్లోగా..
యాంటీబాడీలు పుష్కలంగా ఉన్న ప్లాస్మాతో చికిత్స చేస్తే ప్రయోజనం ఉంటుందని తమ డేటా చెబుతోందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల సెక్రటరీ అలెక్స్ అజర్ తెలిపారు. వీరు కోలుకునే అవకాశం 35 శాతం మెరుగవుతుందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటివరకూ జరిగిన ప్లాస్మా అధ్యయనాల సమర్థతపై వైట్‌హౌస్ కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు ఆంటోనీ ఫౌచీ సహా పలువురు నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:- 'కరోనాపై పోరులో ప్లాస్మా చికిత్స 'ప్రయోగాత్మకమే''