'టైటానిక్' అనగానే ప్రపంచాన్ని కుదిపేసిన ఓ పెను విషాదం గుర్తుకొస్తుంది. నడి సముద్రంలో జరిగిన ఆ దుర్ఘటనలోని కొన్ని అంశాలకు కాల్పనికత, గ్రాఫిక్స్ జోడించి సినిమా తీస్తేనే ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఏకంగా 11 ఆస్కార్ అవార్డులు దక్కే స్థాయిలో ఆదరించారు.
అయితే... ఆ నౌక గురించిన కొన్ని విషయాలు ఇప్పటికీ రహస్యాలుగానే ఉండిపోయాయి. మంచుఖండాన్న ఢీకొట్టి సముద్రంలో సమాధి అయిపోయేటప్పుడు ఆ ఓడలో ఏం జరిగిందో చెప్పడానికి సరైన సమాధానాలే లేవు. అయితే వాటిని తెలుసుకోవాలని ఓ అన్వేషణ యాత్ర ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది అట్లాంటాకు చెందిన ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీ. ఆ నాటి పడవ ప్రమాదానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు, సాక్ష్యాలు సేకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పడవలో కీలకంగా భావించే వైర్లెస్ టెలీగ్రాఫ్‌ను వెలికితీసేందుకు అనుమతి పొందింది. ఆగస్టులో ఇందుకు సంబంధించిన అన్వేషణ ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉండగా.. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది అమెరికా. ఆ యాత్రకు అనుమతి రద్దు చేయాలని వర్జీనియాలోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ వేసింది.
గతంలో అనుమతి...
టైటానిక్ శిథిలాలను వెలికితీసే హక్కుల్ని 1980లో అట్లాంటాకు చెందిన ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీకి ఇచ్చింది అమెరికా కోర్టు. ఆ ప్రక్రియలో నౌక శిథిలాలు మాత్రం చెదిరిపోకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. అయితే అది సాధ్యం కాదని అమెరికా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇప్పటికే ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) సహా అనేక సంస్థలు, వ్యక్తులు ఆనాటి కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
ఆ రేడియో ద్వారా ఆ దారుణ ఘటనకు సంబంధించి రహస్యాలు, సంభాషణలు బయట పడే అవకాశం ఉందని ఆర్ఎంఎస్ టైటానిక్ చెప్తోంది. వీలైనంత వరకు నౌక అవశేషాలు దెబ్బతినకుండా చూస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికీ ఆ టెలీగ్రాఫ్ గదికి వెళ్లేందుకు మార్గం ఉందని.. సూర్య కాంతిలోనే దాన్ని చేరుకోవచ్చని కంపెనీ తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు.
1912లో టైటానిక్ ఓడ ఇంగ్లాండ్ నుంచి న్యూయర్క్ వెళ్తుండగా.. మంచు ఖండాన్ని ఢీకొట్టి అట్లాటింక్ సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో సుమారు 1,508 మంది ప్రాణాలు కోల్పోగా 700 మంది బతికి బయటపడినట్లు అంచనా. ఆ మార్కోనీ టెలీగ్రాఫ్ సాయంతోనే దగ్గర్లోని నేవీ బృందాలు సమాచారం అందుకొని.. సహాయక చర్యలు చేపట్టినట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆ మహిళ మెయిల్‌తో డిక్షనరీలో పదానికి అర్థం మార్పు!