అమెరికా దక్షిణ లాస్ ఏంజెలెస్‌లో.. ఓ భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకుని తరలిస్తుండగా.. ఈ ఘటన జరిగింది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయి. 9 మందికి గాయాలయ్యాయి.
అసలేం జరిగింది?
ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 2,268 కిలోల బాంబులను(చైనాలో తయారైనవి) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే పెద్ద మోర్టార్ సైజు పేలుడు పదార్థాలను కూడా ఆ ఇంట్లో కనిపించాయని పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్వీర్యం చేసేందుకు పోలీసు శాఖకు చెందిన ఓ ట్రక్కులో తరలిస్తుండగా.. మార్గమధ్యంలో పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. సమీపంలోని కార్లు దెబ్బతిన్నాయని చెప్పారు. చుట్టుపక్కల ఇళ్ల కిటీకీలు పగిలిపోయాయని తెలిపారు.
అవీ పేలి ఉంటే..
ముందు జాగ్రత్తగా స్వాధీనం చేసుకున్న బాంబుల్లో కొన్నింటిని ట్రక్కులో కాకుండా బాంబు స్క్వాడ్ కంటెయినర్లో భద్రపరిచామని అధికారులు చెప్పారు. ఈ బాంబులన్నీ పేలి ఉంటే చాలా ఇళ్లు దెబ్బతిని ఉండేవని లాస్ ఏంజెలెస్ పోలీసు శాఖ అధికారి కెప్టెన్ రాబర్ట్ లాంగ్ తెలిపారు.
ఈ ప్రమాదంలో 9 మంది గాయపడ్డారని అగ్నిమాపక శాఖ ట్విట్టర్ వేదికగా తెలిపింది. అయితే.. వారి పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని చెప్పలేదు. కానీ, కొంతమందిని స్ట్రెచర్‌పై తీసుకున్న వెళ్తున్న దృశ్యాలు సంబంధిత వీడియోలో కనపించాయి. సమీపంలోని ఇళ్లల్లో నివసించే వారిని పోలీసులు ఖాళీ చేయించారు.
ఇదీ చూడండి: ఆ దేశాలకు చైనా తీవ్ర హెచ్చరిక!
ఇదీ చూడండి: 'నేను నిన్ను రేప్ చేశా.. ఏం చేస్తావ్?'