ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకంజీ బెజోస్‌కు విడాకులు ఖరారయ్యాయి. వీరిరువురి మధ్య 38.3 బిలియన్ డాలర్లకు విడాకుల ఒప్పందం కుదిరిందని ఓ వార్తా సంస్థ తెలిపింది.
వాషింగ్టన్ కింగ్ కౌంటీ న్యాయస్థానంలో ఖరారైన ఈ ఒప్పందం ప్రకారం... 49 ఏళ్ల మెకంజీ బెజోస్‌కు అమెజాన్.కామ్‌లో నాలుగు శాతం వాటం(సుమారు 19.7 మిలియన్ షేర్లు) దక్కుతుంది. ఈ షేర్ల విలువ 3,830 కోట్ల డాలర్లు. ఫలితంగా ఆమె బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో 22వ స్థానానికి చేరనున్నారు.
విడాకుల ఒప్పందం తర్వాత అమెజాన్‌లో జెఫ్ బెజోస్‌కు 12శాతం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి హోదా అలానే ఉండనుంది.
జెఫ్‌కే అన్నీ...
నవలా రచయిత్రి అయిన మెకంజీ బెజోస్... వాషింగ్టన్ పోస్ట్, అంతరిక్ష పరిశోధన సంస్థ 'బ్లూ ఆరిజన్'లోని తనకున్న వాటాలను జెఫ్‌కు ఇస్తానని ప్రకటించారు. అలాగే తనకున్న అమెజాన్ స్టాక్‌ల ఓటింగ్ హక్కులనూ ఆయనకే అప్పగిస్తానని వెల్లడించారు.
సగభాగం స్వచ్ఛంద సంస్థలకే...
మెకంజీ బెజోస్ తనకున్న సంపదలో సగభాగాన్ని 'గివింగ్ ప్లెడ్జ్'లో భాగంగా స్వచ్ఛంద సంస్థలకు విరాళామనిస్తానని ప్రకటించారు.
ఇలా విడిపోయారు..
జెఫ్ బెజోస్, మెకంజీ 25 ఏళ్ల పాటు అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని గడిపారు. వీరికి నలుగు సంతానం. అమెజాన్ సంస్థ స్థాపించిన తరువాత వీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగారు. అయితే జెఫ్‌కు మరో మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాన్ని ఓ వార్తాపత్రిక బయటపెట్టిన కారణంగా వీరిరువురూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. చివరకు విడాకులు తీసుకున్నారు.
ఇదీ చూడండి:- ఏ క్షణమైనా కుమారస్వామి సర్కార్ పతనం!