కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కడానికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆరోగ్య, ఆర్థిక ప్రణాళికను రూపొందించడమే లక్ష్యంగా జీ20 దేశాల అత్యవసర సమావేశం నిర్వహించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 225 మంది ప్రముఖులు పిలుపునిచ్చారు. వీరిలో నోబెల్ పురస్కార గ్రహీతలు అమర్త్యా సేన్, కైలాష్ సత్యార్థితో పాటు ప్రముఖ ఆర్థికవేత్త కౌషిక్ బసు ఉన్నారు.
ఈ ఏడాది మార్చి 26న.. కరోనాపై పోరుకోసం 5 ట్రిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించాయి జీ20 దేశాలు.
నిజానికి జీ20 దేశాల సమావేశం ఈ ఏడాది నవంబర్‌లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరగాల్సి ఉంది. అంతవరకు వేచి ఉండలేమని.. పేద దేశాలు కరోనాపై యుద్ధం చేయడానికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే 44కోట్ల మంది పేదరికంలోకి జారుకున్నారని, 26కోట్ల 50లక్షలమంది పౌష్టికాహార లోపంతో సతమతమవుతున్నారని గుర్తుచేశారు. జీ20 దేశాలు ముందుకు రాకపోతే.. సంక్షోభం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు.
"ప్రపంచం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. జీ20 దేశాధినేతలు సమావేశమవడానికి ఇదే సరైన సమయం. సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు తక్షణమే సహాయం చేయాలని మేము కోరుతున్నాం. ఈ దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచంలో పేదరికం పెరుగుతోంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు తక్షణమే సహాయం చేయాలి."
-- 225 మంది ప్రముఖులు సంతకం చేసిన లేఖ సారాంశం
లేఖపై సంతకం చేసిన వారిలో ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, ఐరాస సాధారణ అసెంబ్లీ మాజీ అధ్యక్షులు మారా ఫెర్నాండా ఎస్పినోసా, బ్రిటన్ మాజీ ప్రధానులు గార్డన్ బ్రౌన్, టోనీ బ్లెయిర్, దిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసర్చ్ డైరక్టర్ జనరల్ సుమన్ బెరి ఉన్నారు.