ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కరోనా తర్వాత 2020లో అందిరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం అమెరికా అధ్యక్ష ఎన్నిక. డొనాల్డ్ ట్రంప్ సారథ్యాన్ని అమెరికా కొనసాగిస్తుందా? లేక తిరస్కరిస్తుందా? మరోసారి అధ్యక్షుడిగా ట్రంప్‌ను ఎన్నుకుంటారా? లేక ఈసారి మార్పు తప్పదా? అనేవి అందరి మొదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. మరికొన్ని గంటల్లో వీటికి సమాధానం దొరకబోతుంది. నేడు జరగబోయే అధ్యక్ష పోలింగ్‌తో అమెరికన్ల మనసులో మాట తేలబోతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
ఎన్నడూ లేని ఉద్వేగం...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పడూ కీలకమేగాని... ఈసారి ప్రత్యేకతే వేరు. ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికలు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలోనూ ఇంత ఉద్వేభరితమైన ఎన్నిక సమకాలీన రాజకీయ చరిత్రలో లేదు. ఓవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు అమెరికా ప్రజలు తమ భవితవ్యాన్ని తేల్చుకునే దిశగా ఓటు వేయనున్నారు.
సర్వేలన్నీ బైడెన్‌కే...
అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ పూర్తి ఆధిక్యం కనబరుస్తున్నారు. ఎన్నికకు కొన్ని గంటలే ఉన్న సమయంలో విడుదలైన ఎన్బీసీ న్యూస్, వాల్‌స్ట్రీట్ జర్నల్ పోల్‌లో 10 పాయింట్ల ముందంజలో ఉన్నారు. బైడెన్ 52 శాతం ఓట్లు దక్కించుకోనుండగా... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 42 శాతం ఓటర్లు మద్దతుగా ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైంది.
హోరాహోరీ పోటీ జరిగే 12 రాష్ట్రాల్లో బైడెన్ 6 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేల్లో తేలింది. అరిజోనా, ఫ్లోరిడా, జార్జియా, అయోవా, మెయినీ, మిషిగన్, మిన్నెసోటా, ఉత్తర కరోలినా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో బైడెన్‌కు 51 శాతం మద్దతు లభిస్తుండగా.. ట్రంప్ 45 శాతం మద్దతు పొందుతున్నట్లు పోల్స్ తెలిపాయి.
కుర్రకారెక్కువ ఈసారి...
మిలీనియల్స్ (1981-1996 మధ్య పుట్టినవారు), జనరేషన్ జెడ్ (1997 తర్వాత పుట్టినవారు) ఈసారి అమెరికా ఓటర్లలో ఎక్కువగా ఉన్నారు. అర్హులైన ఓటర్లలో వీరు 37 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొత్తతరం ఓటర్లు స్వేచ్ఛాభావాలుగలవారు కాబట్టి తప్పకుండా వీరు తమకే ఓటు వేస్తారని డెమొక్రాట్లు నమ్ముతున్నారు. అయితే వీరిలో ఎంతమంది ఓటింగ్ పట్ల ఆసక్తి చూపుతారన్నది చూడాలి.