వాయు కాలుష్యం మానవాళికి చేస్తున్న చేటు అంతాఇంతా కాదు! నెలలు నిండక ముందే బిడ్డలు పుట్టడానికి ఇది కారణమవుతున్నట్టు కాలిఫోర్నియా వర్సిటీ హెచ్చరించింది. ఈ అంశంపై చేపట్టిన పరిశోధన ఫలితాలను బుధవారం వెల్లడించింది. వాయు కాలుష్యం ఇంటా, బయటా చూపుతున్న ప్రభావాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం సాగించారు. ఇందుకు సంబంధించి 204 దేశాల నుంచి డేటాను సేకరించి, విశ్లేషించారు.
2019లో 60 లక్షల శిశువులు ఇలా..
"గాలిలో ఉండే పీఎం 2.5(పార్టిక్యులేట్ మ్యాటర్-2.5) పరిమాణంలోని కాలుష్య కారక రేణువులు, వంట కారణంగా వెలువడే పొగ.. గర్భిణులపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా నెలలు నిండకముందే కాన్సు కావడానికి దారితీస్తున్నాయి. ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది శిశువులు నెలలు నిండక ముందే జన్మించారు. మరో 30 లక్షల మంది తక్కువ బరువుతో పుట్టారు. ఈ పరిస్థితి కారణంగా నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఇలా జన్మించినవారు జీవితాంతం తీవ్రస్థాయి రుగ్మతలతో సతమతమయ్యే ప్రమాదముంది" అని పరిశోధనకర్త రాకేశ్ ఘోష్ తెలిపారు.
ప్రపంచంలో 90 శాతానికి పైగా మంది బహిరంగ ప్రదేశాల్లో వాయు కాలుష్యానికిగురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో పేర్కొంది. వంట చేసే నిమిత్తం బొగ్గు, పిడకలు, కలపను కాల్చడం ద్వారా కోట్ల మంది ఇళ్లలో కాలుష్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని ప్రస్తావించిన కాలిఫోర్నియా పరిశోధకులు.కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా ఆగ్నేయ, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 78శాతం వరకూ ముందస్తు జననాలను నివారించవచ్చని పేర్కొన్నారు.
కొవిడ్ రెండోదశలో గర్భస్రావాలు మూడింతలు
కొవిడ్ మొదటి దశతో పోల్చితే రెండో దశలో గర్భస్రావాల రేటు మూడింతలు పెరిగినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో వెల్లడైంది. డెల్టా తదితర ప్రమాదకర వేరియంట్ల ప్రభావం, కొవిడ్ నిబంధనలతో గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లలేకపోవడం, పోషకాహారలేమి గర్భస్రావాలకు ప్రధాన కారణాలుగా తేల్చారు. ముంబయిలోని బి. వై. ఎల్. నాయర్ ఛారిటబుల్ ఆసుపత్రిలో.. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది జులై 4 వరకు కొవిడ్ పాజిటివ్ వచ్చిన మొత్తం 1,630 మంది ఆకస్మిక గర్భస్రావానికి గురయ్యారు. వీరి ఆరోగ్య వివరాలను అధ్యయనకర్తలు విశ్లేషించారు. 20 వారాల గర్భాన్ని కోల్పోవడం, 500 గ్రాముల కన్నా తక్కువ బరువున్న శిశువులు జన్మించడం గర్భస్రావం కిందకు వస్తుందని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.
కొవిడ్ తొలిదశలో ప్రతి వెయ్యి కాన్పులకు 26.7 గర్భస్రావాలు కాగా, రెండో దశలో 82.6 గర్భస్రావాలు చోటుచేసుకున్నట్టు గుర్తించారు. ఐసీఎంఆర్ మునుపటి అధ్యయనంలో కొవిడ్ మొదటి దశలో కన్నా రెండో దశలోనే పురుటి తల్లుల మరణాలు ఎక్కువగా ఉన్నట్ట తేల్చింది. భారత్, ఇతర పరిమిత ఆదాయ దేశాల్లోని గర్భిణులకు కొవిడ్ వ్యాక్సిన్ అందించాల్సిన ఆవశ్యకతను తమ అధ్యయనం చాటిచెబుతోందని ఐసీఎంఆర్ నిపుణులు పేర్కొన్నారు. ఈ వివరాలను 'ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ అల్ర్రాసౌండ్ ఇన్ ఒబెస్ట్రీస్ అండ్ గైనకాలజీ' పత్రిక ప్రచురించింది.
ఇదీ చూడండి: మహమ్మారులను ముందుగానే గుర్తించే సాంకేతిక కేంద్రం ఎక్కడుందంటే?