వచ్చే ఏడాది జూన్లో అమెరికా వేదికగా జరగాల్సిన జీ-7 సమావేశం ముందుగా ప్రకటించినట్లుగా తన రిసార్ట్లో జరగదని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంమై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అగ్రరాజ్యం అధ్యక్షుడు.
ట్రంప్ సొంత రిసార్టులోనే జీ-7 సదస్సు ఉంటుందని గత గురువారం ప్రకటించారు శ్వేతసౌధం సిబ్బంది ప్రధాన అధికారి మైక్ ముల్వనేయ్. ఈ ప్రకటన అనంతరం దిగువ సభలో డెమొక్రాట్ సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జీ-7 వేదికే అధ్యక్షుడి అవినీతికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో సమావేశం వేదికగా తన సొంత ఆస్తిని ఉపయోగించాలనే ఆలోచన విరమించుకున్నారు ట్రంప్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.
"మీడియా దుష్ప్రచారం, డెమొక్రాట్ అనుకూల వ్యక్తుల శత్రుత్వం కారణంగా 2020 జీ-7 సదస్సు మియామిలోని ట్రంప్ నేషనల్ డోరల్లో నిర్వహించాలనే నిర్ణయాన్ని విరమించుకుంటున్నాం. "
-ట్రంప్ ట్వీట్
సమావేశం కోసం తాము క్యాంప్ డేవిడ్ సహా మరికొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నామని శ్వేతసౌధం అధికారి ముల్వానేయ్ వెల్లడించారు.
'డోరల్.. ఆ సంబంధాలకు మంచిది కాదు'
ఓ అమెరికా నేతను విదేశీ శక్తుల ప్రభావం నుంచి కాపాడుకునేందుకు ఉద్దేశించిన చట్టాలను ఈ సమావేశం ద్వారా ఉల్లంఘించినట్లు అవుతుందని పలువురు విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇది విదేశీ వ్యవహారాలు, దేశీయ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించారు.
"ఆయన తన కార్యాలయాన్ని అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు."
-జెర్రీ నాడ్లర్, ఛైర్మన్, హౌస్ జ్యుడిషియరీ కమిటీ.
ఇదీ చూడండి: వాళ్లకు ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి: రాహుల్