UNICEF News Today: నేటి బాలలే రేపటి ప్రపంచ భవిష్యత్తు. వారి సంక్షేమంపైనే ఏ దేశ అభివృద్ధి అయినా ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి బాలల నిధి(యునిసెఫ్) సంస్థ కృషి విస్మరించలేనిది. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపా, ఆసియాలలో తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లోని పిల్లలకు అత్యవసర సహాయం అందించేందుకు ఐరాస 1946 డిసెంబరు 11న తాత్కాలికంగా అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థను ఏర్పాటు చేసింది. పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పలు ఇక్కట్లతో సతమతమవుతున్న పిల్లలకు, మహిళలకు అది ఎప్పటికీ ఆదరువుగా నిలవాలని 1953లో ఐరాస సాధారణ సభ తీర్మానించింది. దాంతో యునిసెఫ్ శాశ్వత సంస్థగా మారింది. దాని పేరులోని 'అంతర్జాతీయ', 'అత్యవసర' పదాలను తొలగించినప్పటికీ, ఆ పేరు బహుళ ప్రచారం పొందడంతో అలాగే కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో ప్రతి చిన్నారికీ ఆత్మీయ హస్తం అందించాలన్న ఆశయంతో 75 ఏళ్లుగా యునిసెఫ్ నిర్విరామ పయనం సాగిస్తోంది. ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో సేవలు అందిస్తోంది. దాని ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది.
విస్తృత సేవలు
చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, నీరు, పారిశుద్ధ్యం, విద్య, సంరక్షణ, లైంగిక సమానత్వం వంటి అంశాల్లో ఆయా దేశాల ప్రభుత్వాలు, ఇతర సంస్థలతో కలిసి యునిసెఫ్ పనిచేస్తోంది. ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు, వ్యక్తుల నుంచి అందే విరాళాలతో కార్యకలాపాలను కొనసాగిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో శిశు మరణాల రేటు అధికంగా ఉండేది. దాన్ని కట్టడి చేసేందుకు యునిసెఫ్ తీవ్రంగా శ్రమించింది. 1950కి ముందు అంటు వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా ప్రబలంగా ఉండేవి. వాటి నివారణపై పెద్దయెత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. మలేరియా, క్షయ, ట్రకోమా, కుష్ఠు వంటి వ్యాధులపై విస్తృత ప్రచారాలు చేపట్టింది. 1990లో పిల్లల కోసం ప్రపంచ శిఖరాగ్ర సదస్సును న్యూయార్క్‌లో నిర్వహించింది. సామాజిక సమస్యపై నిర్వహించిన తొలి అతిపెద్ద సదస్సుగా అది గుర్తింపు పొందింది. దాని తీర్మానాలు మేలిమి దిశానిర్దేశంగా నిలిచాయి. యునిసెఫ్ చొరవతో ప్రపంచవ్యాప్తంగా ఏటా డెబ్భై లక్షల మంది శిశువులు టీకాలు పొంది ప్రాణాపాయాన్ని తప్పించుకుంటున్నారు. చాలా దేశాలు పోలియోను తరిమికొట్టగలిగాయి. ఆఫ్రికాలో నారికురుపు సమస్య 97శాతం మేర కనుమరుగైంది. అయోడిన్ ఉప్పు అందడం వల్ల ఏటా తొమ్మిది కోట్ల మంది పిల్లలు బుద్ధిమాంద్య సమస్యను జయిస్తున్నారు. యునిసెఫ్ విశేష సేవలకు 1965లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఇండియాలో ప్రతి శిశువు జననం మేలిమి జీవితానికి ఉత్తమ ఆరంభంగా ఉండాలన్నది యునిసెఫ్ ఆకాంక్ష. దేశీయంగా 1949లో యునిసెఫ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ప్రస్తుతం 17 రాష్ట్రాల్లో దాదాపు 450 మంది సిబ్బంది దాని తరఫున పనిచేస్తున్నారు. భారత్‌లోని పెన్సిలిన్ తయారీ కేంద్రానికి యునిసెఫ్ పరికరాలు, సాంకేతిక సహకారం అందించింది. వృథాగా మిగిలిపోతున్న పాలను పిల్లలకు అందించడంలో కీలక చొరవ చూపింది. 1966లో బిహార్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్రమైన కరవు సంభవించినప్పుడు బోరు బావుల ఏర్పాటుకోసం డ్రిల్లింగ్ రిగ్‌లను సరఫరా చేసింది. మార్క్-2 చేతి పంపులను అభివృద్ధి చేసి గృహస్థుల ఇక్కట్లను తీర్చింది. 1999 ఒడిశా పెను తుపాను, 2001 గుజరాత్ భూకంపం, 2004 సునామీ సమయాల్లో చిన్నారులు, మహిళలకు సహాయ సహకారాలు అందించింది. యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో పోలియో టీకా ఆవశ్యకత గురించి కేంద్ర ప్రభుత్వం వాడవాడలా విస్తృత ప్రచారం చేసింది. జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా పథకం, టీకా, నారికురుపు నివారణ కార్యక్రమాలు, జాతీయ ఆరోగ్య మిషన్, స్వచ్ఛభారత్ వంటి అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో యునిసెఫ్ సహకారం, కీలక భూమిక దర్శనమిస్తాయి. 'కొవాక్స్' కార్యక్రమం కింద పేద దేశాలకు టీకాలను సరఫరా చేయడంలో దాని చొరవ ఎనలేనిది.
విలువైన నివేదికలు
కాలానుగుణంగా శిశు, మహిళా ఆరోగ్యం, పోషణ, ఇతర సామాజిక సమస్యలపై యునిసెఫ్ జరిపే అధ్యయనాలు, వెలువరించే నివేదికలు విధాన నిర్ణయాల్లో ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. కరోనా ప్రభావం బాలలపై తీవ్రంగా ఉండబోతుందన్న యునిసెఫ్ హెచ్చరిక ప్రపంచం మొత్తాన్ని అప్రమత్తం చేసింది. మహమ్మారి విజృంభణ కారణంగా జడలు విప్పిన పేదరికం వల్ల బాల్యవివాహాల ఊబిలో చిక్కుకోబోతున్న చిన్నారులను రక్షించుకోవాలని అది హెచ్చరించింది. భారత్‌లో ప్రతి ముగ్గురు శిశువుల్లో ఒక్కరికే ఆహారం లేదా పానీయం ఒక్కపూటే అందుతున్నట్లు ఇటీవల కుండ బద్దలుకొట్టింది. యువత నైపుణ్యాభివృద్ధికి సైతం ఆ సంస్థ కృషి చేస్తోంది. 10 నుంచి 24 ఏళ్ల వయసు వారికి విదేశాలతో పాటు మన దేశంలో 'యువ' పేరుతో నైపుణ్యాలు మప్పుతోంది. ఆపన్నులకు ఆసరా అందించడం నుంచి అభివృద్ధి కార్యక్రమాలదాకా యునిసెఫ్ సేవలు మరువలేనివి. దేశీయంగా రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల లోపాలు మళ్ళీ పంజా విసరుతున్నాయి. యునిసెఫ్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు పాలకులు సమాయత్తం కావాలి.
- ఎం.అక్షర
ఇదీ చదవండి: