చైనీయుల హ్యాకింగ్ ఘటనలపై అమెరికా కన్నెర్రజేసింది. ఐదుగురు చైనా పౌరులపై అమెరికాకు చెందిన న్యాయ శాఖ అభియోగాలు నమోదు చేసింది. భారత్‌లోని ప్రభుత్వ నెట్‌వర్క్‌లపై హ్యాకింగ్ ప్రయత్నాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 100 కంపెనీలు, సంస్థలపై సైబర్ దాడి చేసినందుకు ఈ చర్యలు తీసుకుంది.
ఈ కేసులో మూడు నేరారోపణలు నమోదు చేసినట్లు అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ జెఫ్రీ రోసెన్ పేర్కొన్నారు. కంప్యూటర్ హ్యాకింగ్‌కు సంబంధించి ఐదుగురు చైనీయులపై అభియోగాలు మోపినట్లు చెప్పారు. వారికి సహకరించిన మరో ఇద్దరిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే చైనా హ్యాకర్లు మాత్రం పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు జెఫ్రీ.
"చైనా పౌరులు చేస్తున్న సైబర్ దాడులు, కంప్యూటర్ చొరబాట్లను నిరోధించేందుకు న్యాయ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చైనా కమ్యునిస్టు పార్టీ మాత్రం మరోదారి ఎంచుకోవడం విచారకరం. చైనాను సైబర్ నేరస్థులకు సురక్షిత ప్రదేశంగా మార్చింది. చైనా వెలుపల సైబర్ దాడులు చేసి ఆ దేశానికి సహాయపడే మేధోసంపత్తిని దొంగలించినంత కాలం ఇదే పంథా అనుసరిస్తోంది."
-జెఫ్రీ రోసెన్, డిప్యూటీ అటార్నీ జనరల్
భారత్‌పైనా
భారత ప్రభుత్వ వెబ్సైట్లనూ నిందితులు హ్యాక్ చేసినట్లు అభియోగపత్రం పేర్కొంది. భారత ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్లలో 'కోబాల్ట్ స్ట్రైక్' అనే మాల్వేర్ను చొప్పించినట్లు వెల్లడించింది.
"2019 సమయంలో నిందితులు భారత ప్రభుత్వ వెబ్సైట్లలోకి చొరబడ్డారు. భారత ప్రభుత్వానికి సహకరించే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు, డేటాబేస్ సర్వర్లలోకి ప్రవేశించారు. భారత ప్రభుత్వానికి చెందిన 'ఓపెన్ వీపీఎన్' నెట్‌వర్క్‌కు అనుసంధానం అయ్యేందుకు నిందితులు 'వీపీఎస్ ప్రొవైడర్'ను ఉపయోగించారు."
-అభియోగపత్రం
నిందితుల చొరబాట్లు వందకు పైగా కంపెనీలపై ప్రభావం చూపాయని అభియోగపత్రం వెల్లడించింది. సాఫ్ట్వేర్ అభివృద్ధి, కంప్యూటర్ హార్డ్‌వేర్, టెలీకమ్యూనికేషన్, సామాజిక మాధ్యమాలు, వీడియో గేమింగ్ కంపెనీలు, మేధోమథన సంస్థలు, విదేశీ ప్రభుత్వాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ అనుకూల రాజకీయ నాయకులు, కార్యకర్తలపై ఈ ప్రభావం పడినట్లు తెలిపింది.