కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతులు లభించిన వెంటనే.. టీకాను దేశవ్యాప్తంగా సరఫరా చేసేందుకు తగిన ప్రణాళిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వద్ద ఉందని శ్వేతసౌధం వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 40 మిలియన్ డోసులు అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. తమతో వ్యాక్సిన్ సరఫరా ప్రణాళికలను ట్రంప్ ప్రభుత్వం పంచుకోవడం లేదని.. అసలు అధ్యక్షుడి యంత్రాంగానికి ఆ సామర్థ్యం ఉందా? అని 2020 అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ ఇటీవల ప్రశ్నించిన నేపథ్యంలో శ్వేతసౌధం ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
"ఈ ఏడాది చివరి నాటికి 40 మిలియన్ డోసులు అందుబాటులో ఉంటాయి. ఇది ఓ అద్భుతమైన విషయం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన వ్యాక్సిన్ ఇదే. ఇది అధ్యక్షుడు ట్రంప్ వల్లే సాధ్యపడింది. ఆయన చెప్పింది.. చేశారు. ఎందరో అమెరికన్ల జీవితాలను కాపాడుతున్న ట్రంప్‌నకు ధన్యవాదాలు."
--- మెక్ఎననీ, శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ
తాము రూపొందిస్తున్న వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు ఫైజర్, మోడెర్నా సంస్థలు ఇటీవలే ప్రకటించాయి. ఆపరేషన్ వార్ప్ స్పీడ్ పేరుతో.. టీకా ఉత్పత్తి, సరఫరా కోసం ఫైజర్‌తో 1.95 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది ట్రంప్ ప్రభుత్వం.
ఇదీ చూడండి:- 'ఫలితాలు మార్చేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు'