పొగ రాయుళ్లలో 4 కోట్ల మంది 15 ఏళ్ల లోపువారే! - tobacco day
పొగాకు ఉత్పత్తులకు అత్యధికంగా యువతే ఆకర్షితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది 13-15 సంవత్సరాల వయస్సు పిల్లలు పొగాకు, నికోటిన్ ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. యువతను ఆకర్షించేందుకు పొగాకు పరిశ్రమ ఏటా 9 బిలియన్ డాలర్లు ప్రకటనల కోసమే ఖర్చు చేస్తోందని, వాటి మార్కెటింగ్ వ్యూహాల్లో పడకుండా చిన్నారులను రక్షించాలని కోరింది.
ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మందికిపైగా 13-15 ఏళ్ల మధ్య వయస్సు చిన్నారులు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారన్న దిగ్భ్రాంతికర వాస్తవాన్ని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). యువతను ఆకర్షించేందుకు ఏటా పొగాకు పరిశ్రమ వర్గాలు 9 బిలియన్ డాలర్లు ప్రకటనల కోసమే ఖర్చు చేస్తున్నాయని లెక్కగట్టింది.
నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని యువతలో అవగాహన కల్పించేందకు చర్యలు చేపట్టింది డబ్ల్యూహెచ్ఓ.
" 40 మిలియన్లకుపైగా 13-15 ఏళ్ల వయస్సు పిల్లలు ఇప్పటికే పొగాకు ఉత్పత్తులను వినియోగించటం ప్రారంభించారు. పొగాకు పరిశ్రమ మార్కెటింగ్ వ్యూహాలపై యువతను అప్రమత్తం చేసేందుకు 13-17 మధ్య వయస్సు పాఠశాల విద్యార్థుల కోసం ఓ కిట్‌ను ప్రారంభించాం. ఏటా సుమారు 80 లక్షల మంది పొగాకు ఉత్పత్తుల కారణంగా మరణిస్తున్నారు. వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు యువతను ఆకర్షించేలా ప్రకటనల కోసం 9 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలోనూ తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటికి బానిసలుగా మారితే కరోనాను ఎదుర్కొనే శక్తిని కోల్పోతారు. ప్రతి పదిమంది పొగ తాగేవాళ్లలో 9 మంది 18 ఏళ్లలోపే ప్రారంభిస్తున్న నేపథ్యంలో యువతలో అవగాహన కల్పించటం చాలా ముఖ్యం."
- రూడిగర్ క్రెచ్, డబ్ల్యూహెచ్ఓలోని హెల్త్ ప్రమోషన్ డైరెక్టర్.
ఈ-సిగరెట్ ప్రమాదకరం..
13-17 సంవత్సరాల వయస్సు పిల్లలు పొగాకు వ్యసనానికి బానిసలు కాకుండా నివారించే ప్రయత్నాలు చేపట్టింది డబ్ల్యూహెచ్ఓ. సాధారణ సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా ఈ-సిగరెట్, హుక్కా సురక్షితమని చెబుతోంది పొగాకు పరిశ్రమ. అయితే.. అవి ఎంత మాత్రం సురక్షితం కావని, వాటిని వినియోగించటం ద్వారా గుండె, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తోంది.
కొవిడ్ సమయంలో ఆఫర్లు..
యువతను ఆకర్షించేందుకు బబుల్ గమ్, మిఠాయి వంటి సుమారు 15వేల ఫ్లేవర్లతో పొగాకు ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు గుర్తించింది ఆరోగ్య సంస్థ. కొవిడ్-19 సమయంలోనూ ఉచితంగా బ్రాండెడ్ మాస్కులు ఇవ్వటం, హోమ్ డెలివరీ వంటి మార్కెటింగ్ వ్యూహాలను అనుసరిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో పొగాకు ఉత్పత్తులను అత్యావసరాల జాబితాలో చేర్చాలని ప్రయత్నాలు చేసిందని పేర్కొంది.
ప్రత్యేక కిట్..
ఎక్కవగా పాఠశాల స్థాయిలోనే పొగాకు అలవాటు పడుతున్న నేపథ్యంలో చిన్నారుల్లో అవగాహన కల్పించేందుకు తరగతి గదిలో వినియోగించేలా ఓ కిట్‌ను రూపొందించింది సంస్థ. దాని ద్వారా పొగాకు పరిశ్రమ ఏ విధంగా ఏమార్చుతుందో అవగాహన కల్పించనుంది. చిన్నారులు పొగాకు ఉత్పత్తులకు బానిసలు కాకుండా రక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని ప్రపంచ దేశాలను కోరింది డబ్ల్యూహెచ్ఓ.