జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడికి సంబంధించి విచారణ నిమిత్తం ద్వైపాక్షిక కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు డెమొక్రాట్లు సహా 35 మంది రిపబ్లికన్ సభ్యులు మద్దతు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా సాగే ఈ ప్రతిపాదనను మరికొంత మంది రిపబ్లికన్లు తిరస్కరించారు. ఈ బిల్లుకు మద్దతు తెలపాలని న్యూయార్క్ ప్రతినిధి, రిపబ్లికన్ నేత జాన్ కాట్కో పేర్కొన్నారు.
"రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తమ పంతాన్ని వీడి, ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతున్నాను. క్యాపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్ల గురించి నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ కమిషన్ ఏర్పాటు ప్రతిపాదన కీలకమైనది. ఆ ఘటన ఎలా జరిగింది? భవిష్యత్తులో క్యాపిటల్ భవనం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలి? వంటి విషయాల అవగాహనకు ఇది ఉపయోగపడుతుంది. ఇది నిజాల్ని తెలుసుకోవడానికి మాత్రమే. పక్షపాత రాజకీయాల కోసం కాదు."
- జాన్ కాట్కో, రిపబ్లికన్ నేత
ప్రతినిధుల సభలో 252-175తో ఆమోదం పొందిన ఈ బిల్లును సెనేట్‌కు పంపారు.
అరెస్టుల పర్వం..
అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించి నిందితుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. 'స్వీకర్ నాన్సీ పెలోసీని బయటకు తీసుకువచ్చి ఉరి తీయండి' అని అరిచిన పెన్సిల్వేనియాకు చెందిన పాలిన్ బార్ ఆఫ్ కేన్ అనే మహిళను న్యూయార్క్, పెన్సిల్వేనియా అధికారులు బుధవారం అరెస్టు చేశారు.
ఈమె వ్యాఖ్యలు భద్రతా దళాలు ధరించిన బాడీ కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో అధికారులు చర్యలు చేపట్టారు. జనవరి 6న క్యాపిటల్ భవనం వద్దకు పాలిన్ వెళ్లారని ఆమె భర్త వెల్లడించారు. కానీ, ఆమె హింసాత్మక ఘటనల్లో పాల్గొనలేదని చెప్పారు. ఈ కేసులో న్యాయస్థానం విచారణకు వర్చవల్‌గా పాలిన్ హాజరయ్యారు. అనంతరం.. ఆమెను బాండ్‌పై అధికారులు విడుదల చేశారు. ఇప్పటివరకు క్యాపిటల్‌పై దాడి ఘటనలో 400కు పైగా మందిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.
ఇదీ చూడండి: 'భారత్‌కు అమెరికా 500 మిలియన్ డాలర్ల సాయం'