అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో పడవ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికితీశారు అమెరికా తీర రక్షణ అధికారులు. చాకచక్యంగా తప్పించుకున్న ఐదుగురు సిబ్బందిని అగ్ని ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే రక్షించారు. మిగిలిన వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు జరిపారు. ఫలితం లేకపోవడం వల్ల వారందరూ మరణించి ఉంటారని.. గాలింపు చర్యలను నిలిపివేశారు అధికారులు.
మృతులంతా సరదాగా స్కూబాడైవింగ్ చేసేందుకు శాంటాక్రూజ్ దీవికి వెళ్లారు. అకస్మాత్తుగా పడవలో చెలరేగిన మంటల్లో చిక్కుకుని అగ్నికు ఆహుతయ్యారు. ప్రమాద సమయంలో ఎక్కువ మంది పడవ కింది భాగంలో ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించి వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని అధికారులు వెల్లడించారు.
ప్రమాద సమాచారం అందుకున్న తీర రక్షణ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు రెండు రోజులు శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. మృతుల్లో చాలా మంది శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. వాటికి డీఎన్ఏ పరిక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పడవలోని ఆక్సిజన్, ప్రోపేన్ ట్యాంకులు పేలడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: అఫ్గాన్‌లో కారు బాంబుదాడి- 16మంది మృతి