కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రాణాంతక వైరస్ను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు తమ పాఠశాలలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం మీద ఆధారపడే దాదాపు 300 మిలియన్ల మంది చిన్నారులు తమ ఆహారాన్ని కోల్పోతున్నారని ప్రపంచ ఆహార సంస్థ తెలిపింది. ఈ మేరకు నివేదకను విడుదల చేసింది.
వైరస్ కారణంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాలను తాత్కాలికంగా మూసివేయటం వల్ల 860 మిలియన్ల మంది (ప్రపంచ విద్యార్థుల్లో సుమారు సగం) విద్యా సంస్థలకు దూరంగా ఉంటున్నారని ఆహార సంస్థ స్పష్టం చేసింది.
దీనివల్ల కొన్ని కోట్ల మంది విద్యార్థులు ఉచిత భోజనానికి దూరంగా ఉంటున్నారని ఆహార సంస్థ తెలిపింది. మొత్తం 61 దేశాల్లోని 18 మిలియన్ల విద్యార్థుల్లో దాదాపు 9 మిలియన్ల మంది చిన్నారులు విద్యాలయాల్లోని ఉచిత భోజనంపై ఆధార పడుతున్నారని డబ్ల్యూఎఫ్పీ పేర్కొంది.
రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూఎఫ్పీ అధికార ప్రతినిధి ఎలిజబెత్ బైర్స్ అభిప్రాయపడ్డారు. అవసరమైతే వారి ఇంటి వద్దకే రేషన్ సదుపాయం కల్పించటం, ఆహారాన్ని అందించటం, వోచర్స్, డబ్బులను వారికి అందించే విధంగా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు వివరించారు. ఇంటి వద్దకే రేషన్లను అందించటం ద్వారా వారి కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు బైర్స్.
ఇదీ చూడండి: శబరిమల ఆలయంలోకి భక్తులకు నో ఎంట్రీ