నల్లజాతీయుడు జాకబ్ బ్లేక్పై పోలీసుల కాల్పులకు వ్యతిరేకంగా అమెరికా విస్కాన్సిన్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆందోళనల్లో భాగంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరొకరు గాయపడ్డారు.
నిరసనలకు ప్రధాన కేంద్రంగా ఉన్న కోర్ట్‌హౌస్ ప్రాంగణంలో మంగళవారం రాత్రి 11.45 గంటలకు కాల్పులు జరిగినట్లు కెనోషా పోలీసులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తి ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఆయుధాలతో నిరసనల్లో పాల్గొన్నారని చెప్పారు.
తెల్లజాతీయుడి పనే!
ఓ శ్వేతజాతీయుడే సెమీ-ఆటోమెటిక్ రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి రైఫిల్ పట్టుకొని వీధుల్లో తిరిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులు వెంబడించగా.. కిందపడిపోయి కాల్పులు జరిపినట్లు అర్థమవుతోంది. అప్పటికే ఘటనా స్థలికి వచ్చిన పోలీసు కార్లు బాధితులవైపే వెళ్లినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది.
కాల్పుల ఘటనలో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు. అయితే వీడియో ఆధారంగా నిందితులను అతిత్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.
జాకబ్ మళ్లీ నడుస్తారా?
మరోవైపు ఆదివారం పోలీసు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నల్లజాతీయుడు జాకబ్ బ్లేక్‌కు సర్జరీ కొనసాగుతున్నట్లు న్యాయవాది బెన్ క్రంప్ తెలిపారు. బులెట్లు అతని శరీరాన్ని తీవ్రంగా గాయపర్చినట్లు వెల్లడించారు. వెన్నెముక పూర్తిగా దెబ్బతిందని.. జాకబ్ మళ్లీ నడవడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులపై సివిల్ దావా వేసేందుకు న్యాయవాదుల బృందం ప్రయత్నిస్తోంది.
ఇదీ చదవండి- ప్రియాంకను తనతో పాటు రమ్మన్న మదర్ థెరిసా!