అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం నిరసనలతో అట్టుడుకుతోంది. ఫిబ్రవరిలో 17 సంవత్సరాల అల్విన్ కోలే మరణానికి కారణమైన.. మిల్వౌకీ పోలీసు అధికారి జోసెఫ్ మెన్సాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తాజా ఆందోళనలకు దారితీసింది.
అయితే జోసెఫ్‌పై ఆరోపణలు రుజువు కాలేదని చెబుతున్నారు పోలీసు అధికారులు. దీనికి నిరసనగా గత 3 రాత్రులుగా ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలోనే.. శుక్రవారం రాత్రి వోవటోసా నగరంలోని సిటీ హాల్ ఎదుట కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి 100 మందికిపైగా గుమికూడారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఉద్రిక్తత చెలరేగింది.
టియర్ గ్యాస్ ప్రయోగం..
నిరసనకారులు పోలీసులపైకి సీసాలు విసిరారు. ప్రతిగా.. బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. గురువారం రాత్రి నిరసనలు చేస్తుండగా.. అల్విన్ కోలే తల్లి ట్రేసీ కోలే సహా ఆమె కుటుంబసభ్యులను అరెస్టు చేశారు. బాధితుడి కుటుంబంపై దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు వారి తరఫు న్యాయవాది.
శుక్రవారం రాత్రి జరిగిన నిరసనల్లో మొత్తం 28 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో చాలా మంది శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని పేర్కొన్నారు. వారి వద్ద బాటిళ్లు, తుపాకులు, ఇతర పేలుడు పదార్థాలు గుర్తించామని చెప్పారు.