అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. 'ఎలక్షన్ డే'కు సరిగ్గా నెలరోజుల సమయం కూడా లేదు. ప్రచారం.. ర్యాలీలు, వర్చువల్ సభలు, సంవాదాలు, సమావేశాలతో హోరెత్తుతోంది. ట్రంప్-బైడెన్ బృందాలు గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఆధ్యక్షుడికి కరోనా సోకడం సమీకరణలను పూర్తిగా మార్చేసింది.
ఇప్పుడేంటి పరిస్థితి ?
అధ్యక్షుడికి కరోనా సోకటం.. అందరినీ కలవరపెట్టింది. కీలక దశలో కొన్ని రోజులు ఆయన ప్రచారం పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అధ్యక్ష పీఠానికి సవాలు విసిరిన మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన ట్రంప్ కొన్ని రోజుల పాటూ ఇంటికే పరిమితం అవ్వనున్నారు.
క్వారంటైన్ ఎన్ని రోజులు ?
ప్రస్తుతం ట్రంప్ మద్దతుదారులు ప్రధానంగా కోరుకుంటోంది... వారి నేత పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రచారంలో పాల్గొనాలనే. కానీ, ఆయన ఎప్పుడు తిరిగి ప్రచార గోదాలోకి అడుగుపెతారన్న అంశంపై స్పష్టత లేదు. అమెరికన్ సీడీసీ లెక్కల ప్రకారం, కరోనా బాధితులు లక్షణాలు కనిపించిన అనంతరం 10 రోజుల తర్వాతే క్వారంటైన్ పూర్తయినట్టు.
ఇదీ చూడండి: ట్రంప్‌కు మాస్కు ధరించాలని చెప్పిన కరోనా..!
మరి రెండో డిబేట్ సంగతేంటి ?
మొదటి డిబేట్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న ట్రంప్.. రెండో సంవాదానికి పూర్తి సన్నద్ధతతో వస్తారని ఆశలు పెట్టుకున్నారు మద్దతుదారులు. అక్టోబర్ 15న జరగాల్సి ఉన్న రెండవ డిబేట్తోనే.. ఆయన ప్రచార పర్వంలోకి తిరిగి అడుగుపెడతారని తెలుస్తోంది.
మద్దతుదారులు ఏమంటున్నారు ?
ట్రంప్ మద్దతుదారులందరూ ఆయన వీలైనంత వేగంగా.. ప్రచారంలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే లక్షల మంది ముందస్తు పోలింగ్‌లో భాగంగా ఓట్లు వేస్తున్నారు. ఈ దశలో ట్రంప్ క్యాంపెయిన్ నిర్వాహకులకు కూడా వైరస్ సోకటం కలవరపెడుతోంది.
ఇదీ చూడండి: కరోనాతో సీన్ రివర్స్- ట్రంప్ క్యాంప్‌లో కలవరం!
డెమొక్రాట్ల పరిస్థితేంటి ?
ట్రంప్ ఆస్పత్రి పాలవ్వటం డెమొక్రాట్లకు కలిసొస్తోంది. కరోనా సంక్షోభంలో ట్రంప్ నాయకత్వంపై వేలెత్తి చూపేందుకు వారికి అవకాశం దొరికినట్లైంది. ఈ నేపథ్యంలో ప్రజల చూపు జో బైడెన్‌వైపు తిరుగుతోంది. ఇది వారికి ఆనందాన్నిచ్చే అంశమే.
గతంలో ఇలాంటి అనుభవం?
ట్రంప్‌నకు ముందు పనిచేసిన ఇద్దరు అధ్యక్షులూ విజయవంతంగా రెండు పర్యాయాలు పూర్తి చేసుకున్నారు. వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురుకాలేదు. ఎన్నికలకు ముందు అధ్యక్షుడు ఇలా తీవ్ర అనారోగ్యం బారిన పడటం ఇదే మొదటిసారి.
ట్రంప్ క్యాంపెయిన్ సంగతేంటి ?
ప్రచారంలో ప్రత్యర్థి కంటే వెనుకబడకుండా ఉండేందుకు రిపబ్లికన్లు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ను రంగంలోకి దించారు. ట్రంప్ కుటుంబ సభ్యులతో కలిసి పెన్స్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. బుధవారం, అక్టోబర్ 7న జరగనున్న ఉపాధ్యక్ష అభ్యర్థుల సంవాదం తిరిగి ట్రంప్ వర్గానికి కొత్త శక్తినిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. అలాగే 'ఆపరేషన్ మాగా'పై భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ఇదీ చూడండి: ట్రంప్ కోసం 'ఆపరేషన్ మాగా'- జోరుగా ప్రచారం
ముందున్న సవాళ్లేంటి ?
ఇన్నాళ్లూ కరోనాను తేలికie తీసిపారేసిన ట్రంప్.. ఈ అంశాన్నే ముందుపెట్టి ఎన్నికల ప్రచారం ఉరకలెత్తించాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. వెంటనే ప్రచార అస్త్రాలను మార్చివేయాల్సిన పరిస్థితి. ఈ అంశం ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్లో కీలక అంశంగా మారే అవకాశాలున్నాయి. ఉపాధ్యక్షుడు పెన్స్‌ను ఇరకాటంలో పెట్టేందుకు, కమలా హ్యారిస్ బృందం ప్రణాళికలు రచిస్తోంది.
పార్టీ పట్టు సడలకుండా బైడెన్ చూసుకోగలరా ?
ప్రస్తుతం ట్రంప్ అనారోగ్యంపై.. అమెరికన్ సామాజిక మధ్యమాల్లో మాటల యుద్ధం నడుస్తోంది. డెమొక్రాట్లను సంయమనం పాటించాలని కోరారు బైడెన్. అయితే, దేశంలో ఆరోగ్య సంక్షోభంపై గట్టిగానే పోరాడాలని నిర్ణయించుకున్నారు. ట్రంప్ పాలనపై, ఆయన నిర్ణయాలపై మాటల దాడి పెంచిన మాజీ ఉపాధ్యక్షుడు.. మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ట్రంప్ ఆస్పత్రి పాలు కాగానే, ఆయనపై రూపొందించిన ఆడ్వర్టైజ్మెంట్లను ఆపేయటం అన్ని వర్గాలను ఆకట్టుకుంది.
ఇదీ చూడండి: 'అధ్యక్షుడికే కరోనా.. ఇకనైనా తీవ్రంగా పరిగణించండి'
తర్వాతి అడుగులు ఎటువైపు ?
ప్రస్తుతం దేశంలో అధ్యక్షుడు ట్రంప్‌పై అసంతృప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. దేశ ప్రజల ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోలేదని, కరోనా బారిన పడకుండా తనను కాపాడుకోలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. కరోనా అంశం నుంచి తమ ప్రచారం దూరం జరగాలని రిపబ్లికన్లు భావిస్తుంటే.. ఇదే అంశంపై అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని డెమొక్రాట్లు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి: 'బైడెన్‌కే ప్రవాసీల మద్దతు- గుజరాతీలు మాత్రం...'
ఇప్పటికే అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు, అధికారులు, వైట్‌హౌస్ వెల్లడిస్తున్న వివరాలకు పొంతన లేకపోవటం ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది.. ఏ సమాచారం నమ్మాలో తేల్చుకోలేక ప్రభుత్వ ధోరణిపైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ట్రంప్ పదవికి ఎసరు తెచ్చేలానే కనిపిస్తోంది.
ఇప్పటికే పది మందిలో... ఏడుగురు అమెరికన్లు కరోనాపై ట్రంప్ చెబుతున్న మాటల పట్ల తమకు లేదంటున్నారని తాజా సర్వే తేల్చింది. ఇలాంటి విపత్కర సమయంలో ట్రంప్ ప్రజల మద్దతు కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. అసలే, మొదటి సంవాదంలో ఢీలా పడిన అధ్యక్షుడు.. రెండో సంవాదం నాటికి శారీరకంగా, మానసికంగా సన్నద్ధమైతేనే రెండోసారి అధ్యక్ష పీఠం అధిరోహించడం సాధ్యం!
ఇదీ చూడండి: అధ్యక్ష ఎన్నికలు: ముందస్తు పోలింగ్ అంటే?
ఇదీ చూడండి: కరోనా దెబ్బతో ట్రంప్ విశ్వసనీయతకే పరీక్ష!